Begin typing your search above and press return to search.
సిరియాలో అల్లర్లు..చెన్నైలో ముస్లింల ఆందోళన
By: Tupaki Desk | 2 March 2018 4:50 PM GMTసిరియా రాజధాని డమాస్కస్ సమీపంలో ఉన్న తూర్పు గౌటా ప్రాంతంలో నెలకొన్న అల్లర్ల తాలుకు ప్రభావం కలకలం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు దారుల నియంత్రణలో ఉంది. రష్యా మద్దతుతో దేశాధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తిరిగి నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వం - తిరుగుబాటుదారుల మధ్య పోరులో అమాయకులైన ప్రజలు సమిధలుగా మారుతున్నారు. ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయనే పేరుతో ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడులు చేయడంతో సామాన్యులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు.
గౌటా యుద్ధ వాతావరణంలో ఇప్పటికీ 3.9లక్షలమంది ప్రజలు చిక్కుకుపోయారని ఐక్యరాజ్యసమితి భద్రతావిభాగం ప్రకటించింది. ఫిబ్రవరి 24న ఐక్యరాజ్యసమితి 30రోజుల కాల్పుల విరమణకు పిలుపునిచ్చినా - బాంబుల మోత ఆగక పోవడంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నది. గత మంగళవారం కాల్పుల విరమణ నిర్ణయాన్ని ప్రకటించిన రష్యా కొన్ని గంటలకే శతఘ్నులను పేల్చింది. గత ఎనిమిదిరోజులుగా ప్రభుత్వ దళాలు జరుపుతున్న వైమానిక దాడుల కారణంగా ఇప్పటివరకు 700మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువమంది ముక్కుపచ్చలారని చిన్నారులు - మహిళలే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ దాడులతో బిక్కచచ్చిపోయిన ఉగ్రవాదులు నగరంలోకి చొచ్చుకొచ్చి పౌరుల్లో కలిసిపోయారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది.
ఈ పరిస్థితిపై మనదేశంలో కల్లోలం నెలకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారణంగా సిరియాలో రక్తం ఏరులైపారుతోందని ఆరోపిస్తు చెన్నైలో శుక్రవారం ముస్లీం సోదరులు ఆందోళనకు దిగారు. చెన్నైలోని సెయింట్ హోం ప్రాంతంలోని రష్యా రాయబారి కార్యాలయం ముందు వేలాది మంది ముస్లిం సోదరులు ధర్నా నిర్వహించారు. రష్యా చేస్తున్న వైమానిక దాడుల వలన అయామకులు, పిల్లలు, మహిళలు బలి అవుతున్నారని సిరియాలో ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలు గుర్తించి వైమానిక దాడులు చెయ్యాలని ముస్లింలు డిమాండ్ చేశారు.వెంటనే సిరియాలో వైమానిక దాడులు నిలిపివెయ్యాలని, లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా, సిరియాలో రక్తమోడుతున్న బాల్యంపై సోషల్ మీడియా తల్లడిల్లుతోంది. రక్తచారికలతో ఉన్న చిన్నారి ఫొటోలు నెటిజన్లను కదిలిస్తున్నాయి. ప్రే ఫర్ సిరియా (సిరియా కోసం ప్రార్థించండి) అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ ఫొటోలను పంచుకుంటున్నారు. సిరియా ఛిన్నాభిన్నమవుతున్న బాల్యాన్ని కాపాడాలని, ఆ దిశగా ప్రపంచ దేశాలు కదలాలని కోరుతూ ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం నడుస్తోంది. కాగా, సిరియాలో మానవతా దృక్పథంతో రోజుకు ఐదు గంటలు మాత్రం దాడులు నిలిపివేస్తామని, ఆ సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.