Begin typing your search above and press return to search.

ఒకే మాట పై ముస్లిం ఓటర్లు ?

By:  Tupaki Desk   |   16 Feb 2022 7:30 AM GMT
ఒకే మాట పై ముస్లిం ఓటర్లు ?
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన రెండు విడతల పోలింగ్ సరళిని బట్టి ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని 128 సీట్లకు గాను రెండు విడతల్లో 113 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయ్యింది.

మొదటి విడతలో 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే మిగిలిన నియోజకవర్గాలకు రెండో విడత పోలింగ్ జరిగింది. రెండు విడతల పోలింగ్ లో ఓటింగ్ విధానాన్ని విశ్లేషిస్తే ఎస్పీ కూటమికే ఓటర్లు ఎక్కువ మొగ్గు చూపినట్టు అర్ధమవుతోంది.

2017 ఎన్నికల్లో 128 నియోజకవర్గాల్లో బీజేపీ 91 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇప్పుడు పూర్తయిన పోలింగ్ లో అలాంటి పరిస్థితికి విరుద్ధంగా కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే జాట్లు, ముస్లింల ఓటర్లనే చెప్పాలి. ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నట్లు స్పష్టంగా కనబడుతోంది. పైగా ఓటింగ్ కు వచ్చిన వారిలో అత్యధికులు ఎస్పీ కూటమికే ఓట్లేసినట్లు బాహాటంగానే చెబుతున్నారట.

ఆ మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా ముస్లిం ఓటర్లు ఇలాగే ఏకపక్షంగా వ్యవహరించారు. బీజేపీకి ఓట్లేయటం ఇష్టంలేక ఇతర పార్టీలకు ఓట్లేస్తే ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని గ్రహించారు. దాంతో ఏకతాటిపైన నిలబడి తృణమూల్ కాంగ్రెస్ కే ఓట్లేశారు. దీంతోనే మమతా బెనర్జీకి బ్రహ్మాండమైన హ్యాట్రిక్ విజయం సాధ్యమైంది. ఇపుడు యూపీ ఎన్నికల్లో కూడా అదే వైఖరి కనబడుతోందనే విశ్లేషణలు పెరిగిపోతున్నాయి.

రెండో విడత పోలింగ్ జరిగిన 55 నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల షేర్ 45 శాతం ఉంది. 2017 ఎన్నికల్లో ముస్లిం ఓటర్లలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల మధ్య బాగా చీలిపోయింది. దీంతో సహజంగానే బీజేపీ లబ్ధి పొందింది.

అయితే ఈసారి కాంగ్రెస్, బీఎస్పీల వైపు ఓటర్లు పెద్దగా చూడటంలేదు. ఇందులో జాట్లు, ముస్లిం ఓటర్లది కీలకపాత్రయిపోయింది. మరి మిగిలిన ఐదు విడతల పోలింగ్ లో ఓటర్ల సరళి ఎలాగుంటుందనే ఆసక్తి పెరిగిపోయింది.