Begin typing your search above and press return to search.

యాంటీ ముస్లిం కార్డుతో అమెరికా అధ్యక్ష రేసు

By:  Tupaki Desk   |   11 Jan 2016 11:27 AM GMT
యాంటీ ముస్లిం కార్డుతో అమెరికా అధ్యక్ష రేసు
X
అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకెళ్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదరణను, ఆగ్రహాన్ని అంతేస్థాయిలో ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆయన మరోమారు తన ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించారు. దక్షిణ కరోలినాలోని విన్‌ థ్రోప్‌ యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సభలో ఆయన తన పట్ల నిరసన తెలిపిన వారినుద్దేశించి ''నీ దగ్గర బాంబు ఉందా?'' అంటూ ఆగ్రహంగా అరుస్తూ వాళ్లను గెంటేయడండంటూ పోలీసులకు సూచనలిచ్చారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ వేదిక మీదకు రాగానే సభలో ఉన్న రోసే హమీద్‌ అనే మహిళ, మరికొందరు లేచి నుల్చుని నిరసన తెలిపారు. 'ఐ కమ్‌ ఇన్‌ పీస్‌' 'ముస్లిమ్స్‌' అని రాసి ఉన్న టీషర్టులు, బ్యాడ్జీలతో వారు నిరసన తెలిపారు. డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న జాతి విద్వేష వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్నామని ప్రకటించారు. వారిని అలా చూడగానే ట్రంప్ కోపం కట్టలు తెంచుకుంది. వారిని బయటకు పంపించేయండంటూ పెద్దపెద్ద కేకలు వేశారు. దీంతో పోలీసు అధికారులు, ఇతరులు వారిని బలవంతంగా బయటకు పంపించారు.

కాగా ట్రంప్ తీరుపై అమెరికాలో, బయట దేశాల్లోనూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'ద కౌన్సిల్‌ ఆన్‌ అమెరికా- ఇస్లామిక్‌ రిలేషన్స్‌' సంస్థ ట్రంప్ తీరుపై మండిపడింది. డొనాల్డ్‌ ట్రంప్‌ క్షమాపణలు చెప్పాలని పట్టుపడుతోంది. ముస్లిం వ్యతిరేకత భావజాలాన్ని ఆయన అమెరికన్లలో వ్యాపింపజేస్తున్నారని... తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని కుటిల ఎత్తులు వేస్తున్నారని మండిపడుతున్నారు. అంతకుముందు కూడా ట్రంప్ మెక్సికన్లు, ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను అమెరికాలో ప్రవేశించకుండా నిషేధించాలని ఆయన పలు సభల్లో చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది.

కాగా అధ్యక్ష పదవి రేసులో అవకాశాలు బాగానే కనిపిస్తున్నా పోటీ తీవ్రంగా ఉండడంతో ముస్లిం వ్యతిరేకతను ట్రంప్ కార్డులా వినియోగించుకుంటూ ఎన్నికల్లో గెలవాలని డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.