Begin typing your search above and press return to search.

ముస్లింల ఆఫ‌ర్‌..ఆయ‌న‌పై ఇంకు చ‌ల్లితే 11వేలు

By:  Tupaki Desk   |   13 July 2018 10:26 AM GMT
ముస్లింల ఆఫ‌ర్‌..ఆయ‌న‌పై ఇంకు చ‌ల్లితే 11వేలు
X
బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. దేశం హిందూ పాకిస్థాన్‌ గా మారడం ఖాయమని కాంగ్రెస్ నేత - కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో థరూర్ ప్రసంగిస్తూ.. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ కనుక విజయం సాధించి - లోక్‌ సభలో తగినంత బలముంటే.. దేశంలో ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం మనుగడ సాధించడం కష్టమే. కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చి - పాకిస్థాన్ మాదిరిగా మైనార్టీల హక్కులను కాలరాస్తుంది. మైనార్టీల సమానత్వాన్ని దెబ్బతీసేలా హిందూరాష్ట్ర ఏర్పాటు దాని లక్ష్యం. అదే జరిగితే దేశం హిందూ పాకిస్థాన్‌ గా మారుతుంది. గాంధీ - నెహ్రూ - సర్దార్ పటేల్ - మౌలానా ఆజాద్ వంటి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు ఏమవుతాయి? అని థరూర్ ప్రశ్నించారు. దీనిపై అనేక‌మంది భార‌తీయులు ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటు థ‌రూర్‌పై అటు కాంగ్రెస్ పార్టీపై వారు దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ హిందూ వ్య‌తిరేక బుద్ధి అర్థ‌మైంద‌ని విమ‌ర్శించారు.

అయితే, ఇలా శశిథరూర్ వ్యాఖ్యల‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స‌మ‌యంలోనే అలీఘర్‌ కు చెందిన ముస్లిం యూత్ అసోసియేషన్ నాయకుడు మహ్మద్ అమీర్ రషీద్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శశి థరూర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న పెట్టాడు. శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు హిందూవులనే కాకుండా.. దేశభక్తి ఉన్న ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని అమీర్ పేర్కొన్నాడు. హిందూ పాకిస్థాన్‌ గా దేశం మారడం ఖాయమన్న శశిథరూర్ ముఖంపై నల్లటి ఇంకు చల్లిన వారికి రూ. 11 వేలు బహుమానం ఇస్తానని ఆయన తెలిపాడు. హిందూవులు - ముస్లింలను విడగొట్టేందుకు శశిథరూర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డాడు.

కాగా, థ‌రూర్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. భారత ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చూపడానికి, హిందువులను అపఖ్యాతి పాల్జేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ``థరూర్ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. నరేంద్ర మోడీపై - బీజేపీపై తన ద్వేషాన్ని చాటుకునేందుకు అన్ని రకాల లక్ష్మణరేఖలను కూడా కాంగ్రెస్ దాటుతున్నది. బీజేపీని అప్రతిష్ట పాల్జేసేందుకు భారత ప్రజాస్వామ్యాన్ని కూడా కించపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడటం లేదు` అని సంబిత్‌ పాత్రా ఆరోపించారు. `మోడీని రక్తబేహారి అని రాహుల్ వ్యాఖ్యానించడం, లక్షిత దాడులను అంగీకరించలేకపోవడం, కశ్మీర్‌ లో ఉగ్రవాదుల కన్నా సాధారణ ప్రజల్నే భారత సైన్యం ఎక్కువగా చంపిందన్న గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు - తాజాగా శశిథరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నైజాన్ని చాటిచెబుతాయి. సొంతదేశాన్ని - ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని - హిందువులను కించపరచడం సిగ్గుచేటు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి` అని సంబిత్‌ పాత్రా డిమాండ్ చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలను థరూర్ సమర్థించుకున్నారు. ``నేను మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదు. పదే పదే అనడానికి కూడా సిద్ధమే. ఆర్‌ ఎస్‌ ఎస్ ప్రవచించే హిందూరాష్ట్ర భావన.. పాకిస్థాన్ లాంటిదే. మెజారిటీలు పెత్తనం చెలాయిస్తూ, మైనార్టీలకు సమాన హక్కుల్ని ఇవ్వనిరాకరించడమే వారి ఉద్దేశం. అదే జరిగితే హిందూపాకిస్థాన్‌ గా భారత్ తయారవుతుంది. అది పాకిస్థాన్‌ కు హిందూ వెర్షన్`` అని థరూర్ తన ఫేస్‌ బుక్ ఖాతాలో మరోసారి స్పష్టం చేశారు.