Begin typing your search above and press return to search.
అమెరికా విమానాశ్రయాల్లో అల్లకల్లోలం!
By: Tupaki Desk | 30 Jan 2017 11:45 AM GMTప్రస్తుతం అమెరికా విమానాశ్రయాల్లో అల్లకల్లోలం చోటుచేసుకుంది. నిన్నమొన్నటివరకూ ఇంటర్నల్ గా ప్రశాంతంగా ఉన్న అగ్రరాజ్యంలోని వాసులు విమానాశ్రయాలు వేదికగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ప్రతీ చౌరస్తా కనీసంగా వేలమందితో నిండిపోతుంది.. ప్రతీ పార్కు కనీసం పదివేలమంది ఆందోళన కారులతో నిండిపోయింది. విమానాశ్రయ ప్రాంగణాలన్నీ నిరసనకారుల నినాదాలతో మారుమ్రోగిపోతున్నాయి. దీనంతటికీ కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
అధికార పీఠం ఎక్కి పట్టుమని పది రోజులు కూడా కాక ముందే తానేంటో.. తన విధానాలేంటో.. భవిష్యత్తులో అమెరికా ఎలా ఉండబోతుందో.. తన మార్కు పరిపాలన ఎలా ఉండనుందో చెప్పేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భవిష్యత్తులో అమెరికా గురించి చెప్పాల్సి వస్తే... "ట్రంప్ కు ముందు, ట్రంప్ తర్వాత" అనే పరిణామాలు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని జనాలు చెబుతున్నారంటే అమెరికాలో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. "వీసా నిబంధనలు పునరుద్ధరించే మరో 90 రోజులుపాటు ఏడు దేశాల ముస్లింలకు అమెరికాలోకి ప్రవేశంలేదు" అంటూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై అమెరికా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ నిర్ణయంపై "ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు.. వలసదారులు, శరణార్థులు అమెరికాకు నిర్భయంగా రావొచ్చు" అంటూ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆహ్వానిస్తున్నారు. లాస్ ఎంజెల్స్, వాషింగ్టన్, డల్లాస్, న్యూయార్క్ జేఎఫ్ కెన్నడీ, శాన్ ఫ్రాన్సిస్కో, రాలేగ్, సీటెల్, హ్యూస్టన్, పోర్ట్లాండ్, అట్లాంటాతోపాటు పలు విమానాశ్రయాల్లోని టర్మినల్స్ వద్ద వేలల్లో చేరిన పౌరులు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తమదైన శైలిలో వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజున ఎలాగైతే ఫ్లకార్డులు చేతపట్టి భారీ ర్యాలీలు తీశారో, ప్రస్తుతం ఈ నిర్ణయం అనంతరం కూడా అలానే చేస్తున్నారు. "ద్వేషం లేదు.. భయం లేదు.. వలసదారులు మేం స్వాగతం పలుకుతున్నాం" అంటూ గీతాలు ఆలపింస్తున్నారు. అయితే... ఇంతజరుగుతున్నా ఇప్పటివరకూ ఆందోళన కారులను అరెస్టులు చేసిన దాఖలాలు లేవు.
అయితే.. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇలాంటి భారీ నిర్ణయాలు ట్రంప్ నుంచి ఇంకా జాలువారబోతున్నాయని పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటం గమనార్హం!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/