Begin typing your search above and press return to search.

అష్టావ‌ధానంలో 'ల‌లితా జ్యువెల‌ర్స్ గుండు'

By:  Tupaki Desk   |   18 Dec 2017 4:20 AM GMT
అష్టావ‌ధానంలో ల‌లితా జ్యువెల‌ర్స్ గుండు
X
ఒక సంస్థ అథినేత‌.. సినిమా.. క్రీడా సెల‌బ్రిటీల‌కు త‌ల‌ద‌న్నే ఇమేజ్ ను తెచ్చుకోవ‌టం అంత తేలికైన విష‌యం కాదు. త‌మ ఉత్పత్తుల‌కు పేరు మోసిన సెలబ్రిటీల‌కు కోట్లాది రూపాయిలు రెమ్యున‌రేషన్ గా ఇచ్చేసి మ‌రీ ప్ర‌చారం చేయించుకుంటుంటారు. కానీ.. ఇందుకు భిన్నంగా ఆలోచించారు ల‌లితా జ్యూవెల‌ర్స్ అధినేత‌.

నున్న‌గా ఉన్న గుండుతో.. బొద్దుగా ఉండే ఆయ‌న త‌న బ్రాండ్ కు తానే ప్ర‌చార‌క‌ర్త‌గా మారారు. ఎంత‌లా అంటే.. ఎక్క‌డ చూసినా తానే క‌నిపించేలా భారీ ప్ర‌చారానికి తెర తీశారు. అక్క‌డా.. ఇక్క‌డా అన్న తేడా లేకుండా జ‌న జీవితాల్లోకి దూసుకు రావ‌ట‌మే కాదు.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో అంద‌రి నోట నానేలా చేయ‌టంలో ల‌లితా జ్యూవెల‌ర్స్ అధినేత స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి.

దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనివారు ఏ ఇద్ద‌రు క‌లిసినా త‌మ మాట‌ల్లో ల‌లిత జ్యూవెల‌ర్స్ గురించి.. దానికి ప్ర‌చార క‌ర్త‌గా ఉండే గుండు బాస్ గురించి మాట్లాడుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. హైద‌రాబాద్ లో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లోనూ గుండు బాస్‌ ముచ్చ‌ట ప్ర‌స్తావ‌న రావ‌టం గ‌మ‌నార్హం.

మ‌హా స‌భ‌ల నేప‌థ్యంలో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ర‌వీంద్ర‌భార‌తిలో జంట క‌వుల అష్టావ‌ధానం జ‌రిగింది. ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో అంద‌రూ అనుకునేంత క్లిష్ట‌మైన అంశాలు కాకుండా.. స‌గ‌టుజీవులు మాట్లాడుకునే అంశాలు ప్ర‌స్తావ‌న‌కు రావ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఇక‌.. అంద‌రి చేత న‌వ్వులు పూయించిన ఎపిసోడ్ అంటే మాత్రం.. అప్ర‌స్తుత ప్ర‌సంగికుడు (సీరియ‌స్ గా సాగే అష్టావ‌ధానాన్ని దారి త‌ప్పేలా చేయ‌టం కోసం.. దృష్టి మ‌రల్చేలా చేయ‌టం కోసం ఈ ప్ర‌స్తుత ప్ర‌సంగికుడ్ని పెడ‌తారు. వారి ప‌న‌ల్లా.. చిలిపి మాట‌ల‌లో డ్రిస్ట‌బ్ చేయ‌ట‌మే) ఎంట‌రై.. ల‌లితా జ్యూవెల‌ర్స్ అధినేత ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. దీంతో.. ప్రాంగ‌ణం మొత్తం న‌వ్వులు విర‌బూశాయి.

ల‌లితా జ్యూవెల‌ర్స్ వారి గుండు నున్న‌గా ఉంటుందా? క‌ట్ట‌ప్ప వారి గుండు నున్న‌గా ఉంటుందా? అంటూ ముత్య‌పు నీల‌కంఠం సంధించిన ప్ర‌శ్న‌తో ఆహుతులంతా ఒక్క‌సారిగా పెద్ద పెట్టున న‌వ్వారు. దీనికి జంట క‌వులు స్పందిస్తూ.. ఏ గుండైనా చుండ్రు లేని గుండైతే బాగుండు.. పుండు లేని గుండైతే ఇంకా బాగుండు అంటూ బ‌దులివ్వ‌టంతో స‌భా ప్రాంగ‌ణ‌మంతా చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగాయి. మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. ల‌లితా జ్యువెల‌రీస్ గుండు వ్య‌వ‌హారం సాహిత్య స‌భ‌లోనూ ప్ర‌స్తావ‌న రావ‌టం చూస్తే.. గుండుబాస్ పాపులార్టీ ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.