Begin typing your search above and press return to search.

బెజవాడలో మటన్ ​మాఫియా.. జోరుగా కుళ్లిన మాంసం విక్రయాలు

By:  Tupaki Desk   |   8 Nov 2020 11:30 PM GMT
బెజవాడలో మటన్ ​మాఫియా.. జోరుగా కుళ్లిన మాంసం విక్రయాలు
X
మటన్​ కొంటున్నారా? ఇక మీదట జాగ్రత్తగా ఉండండి.. అది ఫ్రెష్​ అయితేనే, తెలిసిన దుకాణం అయితేనే కొనుగోలు చేయండి.. తక్కువ ధర వస్తుందని ఎక్కడపడితే అక్కడ మటన్​ కొన్నారంటే బుక్కైపోతారు. ఎందుకంటే పదిరోజులు, పదిహేను రోజుల కింద తెచ్చిన మాంసాన్ని రసాయనాలు కలిపి అంటగడుతున్నారు. మాంసం దుకాణాల్లో తనిఖీలు చేసిన అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. సమీప గ్రామాలనుంచి తక్కువ ధరకు మేకలను, గొర్రెలను కొంటున్న మటన్​ దుకాణాల యజమానులు చాలా రోజుల పాటు నిల్వ ఉంచిన మటన్​ను అమ్ముతున్నారు.కొన్ని దుకాణాల్లో 10రోజులపైబడిన మాంసాన్ని అమ్మడం అధికారులు గుర్తించారు. పురుగులు పడి కుళ్లిపోయిన మాంసాన్ని కూడా రసాయనాలతో శుభ్రపరిచి కొన్ని దుకాణాల్లో అమ్ముతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాంసం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల విజయవాడలోని ఓ ప్రముఖ రెస్టారెంట్​లో అధికారులకు కుళ్లిపోయిన మాంసం కనిపించిన విషయం తెలిసిందే. దీంతో నగరంలోని అన్ని మటన్​ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా ఈ విషయాలు వెలుగుచూశాయి.
ఆదివారం ఉదయం అధికారులు విజయవాడ పాత బస్తీ గొల్లపాలెం గట్టులో ఉన్న మటన్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ పురుగులు పట్టిన మాంసాన్ని గుర్తించారు.. 10 రోజులుగా ఆ మాంసాన్ని నిల్వ ఉంచారు. కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తేల్చారు.. ఆ షాపుల నిర్వహించే వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ మాంసం ఏ హోటల్‌కు సరఫరా అవుతుందా అని ఆరా తీస్తున్నారు. 70 కేజీల పురుగు పట్టిన మాంసం సీజ్ చేశారు. నగరంలో మటన్, చికెన్ కొనుగోలు చేసేవారు పరిశీలించి తాజాగా ఉన్న మాంసాన్నే తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం.. విజయవాడలోని ఓ రెస్టారెంట్‌ నిర్వాకం బయటపడింది. పుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో దిమ్మ తిరిగే వ్యవహారాలు బయటకొచ్చాయి. ఎంజీరోడ్డులోని లైఫ్‌స్టైల్‌ బిల్డింగ్‌లో ఉన్న రెస్టారెంట్‌లో విజిలెన్స్‌, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.. వంటగది, స్టోర్‌రూంలను పరిశీలించగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మటన్‌ గడ్డ కట్టుకుపోయి కుళ్లిపోయే స్థితిలో ఉన్నది. మటన్‌, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, హానికర రసాయనాల చూసి అధికారులు షాక్​ అయ్యారు.