Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో మ‌టన్ ఆన్ వీల్స్..కాన్సెప్ట్ ఏమిటంటే?

By:  Tupaki Desk   |   3 April 2019 1:30 AM GMT
హైద‌రాబాద్ లో మ‌టన్ ఆన్  వీల్స్..కాన్సెప్ట్ ఏమిటంటే?
X
ముక్క లేనిది ముద్ద దిగ‌ని మ‌హాన‌గ‌రాల్లో హైద‌రాబాద్ జోరు అంతా ఇంతా కాదు. వారాంతంలోనే కాదు.. ఏ మాత్రం చిక్కినా అయితే చికెన్.. కాదంటే మ‌ట‌న్ వినియోగానికి మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తుంటారు. నాన్ వెజ్ మీద ఇంత‌లా మ‌క్కువ ఉన్న హైద‌రాబాదీల‌కు మ‌రో అవ‌కాశం త‌లుపు త‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ మట‌న్ కోసం షాపుల వ‌ద్ద‌కు.. రోడ్ల ప‌క్క‌న అమ్మే బండ్ల వ‌ద్ద‌కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు.

ఇందులో శుభ్ర‌త‌.. నాణ్య‌త విష‌యంలో బోలెడ‌న్ని అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే.. ఇక‌పై ఇలాంటి సందేహాలు తీరిపోనున్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌యోగాత్మ‌కంగా షురూ చేసిన మ‌ట‌న్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. పూర్తి స్థాయి శుభ్ర‌త‌తో పాటు.. చ‌క్క‌టి వాతావ‌ర‌ణంలోమాంసాన్ని ప్రాసెస్ చేసి ఈ వాహ‌నంలో అమ్ముతుంటారు. దోమ‌లు.. ఈగ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా తాజా మాంసాన్ని అమ్మే ఈ వాహ‌నం ఒక్కొక్క‌టి రూ.12 ల‌క్ష‌లుగా చెబుతున్నారు.

ఈ కాన్సెప్ట్ న‌చ్చితే గొర్రెల మేక‌ల అభివృద్ధి స‌మాఖ్య త‌ర‌ఫున అద్దెకు తీసుకునే వెసులుబాటును క‌ల్పిస్తున్నారు. మ‌ట‌న్ ఆన్ వీల్స్ ప్రోగ్రాంలో భాగంగా తొలుత హైద‌రాబాద్ లోని చార్మినార్‌ - సికింద్రాబాద్‌ - మెహిదీపట్నం - ఎల్‌ బీనగర్‌ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేనున్నారు. మొద‌టి ద‌శ‌లో మట‌న్ తో పాటు.. మ‌ట‌న్ బిర్యానీని కూడా అమ్మ‌నున్నారు.

టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన గొర్రెల పంప‌కం కార్య‌క్ర‌మం పుణ్య‌మా అని రెండేళ్ల వ్య‌వ‌ధిలో గొర్రెల వృద్ధి భారీగా చోటు చేసుకొని ఇప్పుడు 2.24 కోట్ల‌కు గొర్రెలు చేరాయి. ఈ నేప‌థ్యంలో నాణ్య‌మైన మాంసానికి ఢోకా లేని ప‌రిస్థితి. వాణిజ్య ప‌రంగా మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా మ‌ట‌న్ ఆన్ వీల్స్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వాహ‌నాల్లో అమ్ముతున్న మ‌ట‌న్ బెంగ‌ళూరు నుంచి తెప్పిస్తున్నారు. రానున్న రోజుల్లో హైద‌రాబాద్ లోని గొర్రెల‌నే వినియోగించ‌నున్నారు. నాణ్య‌మైన మ‌ట‌న్ కోసం వెతికే న‌గ‌ర జీవుల‌కు తాజా ప్రోగ్రామ్ సాయంగా మారుతుందన‌టంలో సందేహం లేదు.