Begin typing your search above and press return to search.

ప్రముఖులపై దేశ ద్రోహం కేసులో కొత్త ట్విస్ట్

By:  Tupaki Desk   |   10 Oct 2019 11:58 AM GMT
ప్రముఖులపై దేశ ద్రోహం కేసులో కొత్త ట్విస్ట్
X
ప్రజాస్వామ్య భారతంలో ఎవరు ఎవరి మీదనైనా కేసు పెట్టే స్వేచ్ఛ ఉంది. ఆ హక్కు కూడా ఉంది. ఇలాంటి హక్కుల్ని ఎంతలా దుర్వినియోగం చేస్తారన్న అంశానికి ప్రతిగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ప్రధాని మోడీ తీరు బాగోలేదని.. ఆయన పాలనలో దేశంలో మూక పాలన అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తూ.. సినీరంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన యాభై మంది ప్రముఖులు గతంలో ఒక బహిరంగ లేఖ రాశారు.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఈ బహిరంగ లేఖను తప్పు పడుతూ.. దేశంలో అనైక్యతకు ఇలాంటి లేఖలు కారణమవుతున్నాయని పేర్కొంటూ.. ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన సినీ ప్రముఖులందరికి నోటీసులు ఇవ్వటంతో పాటు.. వారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రముఖుల మీద దేశ ద్రోహం కేసు నమోదు చేయటమా? వారు చేసిన తప్పు ప్రధాని మోడీకి బహిరంగ లేఖను రాయటమేనా? అన్న ప్రశ్నలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

యాభై మంది ప్రముఖులపై ముజుఫర్ పూర్ కు చెందిన సుధీర్ కుమార్ ఓఝూ అనే లాయరు 50 మంది ప్రముఖులపైనా కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో.. వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. ఇది సంచలనంగా మారి.. పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో తాజాగా కొత్త మలుపు తిరిగింది.

బిహార్ లోని సర్దార్ పోలీస్ స్టేషన్ లో నమోదైన దేశద్రోహం కేసును మూసివేయాలంటూ ముజఫర్ పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ సిన్హా తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దేశంలో మూకదాడులు పెరిగాయంటూ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన ప్రముఖుల్లో సినీ దర్శకుడు మణిరత్నం.. బాలీవుడ్ కు చెందిన కొంకణాసేన్.. అదూర్ గోపాల్ కృష్ణన్.. అపర్ణాసేన్.. రేవతి.. అనురాగ్ కశ్యప్.. శ్యామ్ బెనగల్.. రామచంద్ర గుహ లాంటి యాభై మందిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ తో పాటు వామపక్ష నేతలు.. డీఎంకే.. ఆర్జీడేతో పాటు పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేయటంతో పోలీసులు వెనక్కి తగ్గక తప్పలేదు. ఫర్లేదు.. దేశంలోని పరిస్థితుల మీద ప్రముఖులకు విమర్శిస్తూ లేఖ రాస్తే.. దేశ ద్రోహం కేసు అయితే పడదన్న మాట.