Begin typing your search above and press return to search.

ఏడుకొండలవాడి ఆస్తి కోసం హైకోర్టులో కేసు

By:  Tupaki Desk   |   18 Oct 2016 11:26 AM GMT
ఏడుకొండలవాడి ఆస్తి కోసం హైకోర్టులో కేసు
X
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు వాటా ఇవ్వాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న‌కు ముందు 2002-13 మ‌ధ్య‌ వరకు టీటీడీ ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి వాటా రావాల‌ని పిటిష‌నర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాను హైకోర్టు ఇప్పించాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీక‌రించింది. అంతేకాదు.. ఈ అంశంపై త‌మ‌కు మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని టీటీడీతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - తెలంగాణ స‌ర్కారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణ వాటా కోరుతూ హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందర్ రాజన్ ఈ కేసు వేశారు. టీటీడీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పించాలని ఆయన పిటిషన్ లో కోరారు. కాగా దీనిపై తదుపరి విచారణను కోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. టీటీడీ ఆదాయంలో వాటా విషయం గతంలోనూ ప్రస్తావనకు వచ్చినా ఇలా కేసుల వరకు వెళ్లడం లేదు.

మరోవైపు ఏడుకొండల వాడికి తెలంగాణ సీఎం తన మొక్కు చెల్లించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలా ఏకంగా తిరుమలేశుడి ఆదాయంలో వాటా కోసం కేసులు పడడం చర్చనీయంగా మారింది. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు వేసిన ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయా లేదంటే ఆయన తనంతట తానుగానే కేసు వేశారా అన్నది తెలియాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/