Begin typing your search above and press return to search.

గిన్నిస్ లో.. ‘‘నా ఇటుక.. నా అమరావతి’’

By:  Tupaki Desk   |   11 Nov 2015 4:12 AM GMT
గిన్నిస్ లో.. ‘‘నా ఇటుక.. నా అమరావతి’’
X
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ సర్కారు స్టార్ట్ చేసిన ‘‘నా ఇటుక.. నా అమరావతి’’ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా ఒక ఫీట్ గిన్నిస్ లో నమోదు అయ్యింది. నా ఇటుక నా అమరావతి కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించటం ద్వారా మరింత ప్రచారాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కారు ఉంది. ఇందులో భాగంగా గిన్నిస్ లోని ఒక రికార్డు మీద గురి పెట్టి.. అనుకున్నది సాధించారు.

ఏంటా.. గిన్నిస్ రికార్డు?

24 గంటల వ్యవధిలో ఏదైనా కార్యక్రమానికి సంబంధించి అత్యధికులు పార్టిసిపేట్ చేయటం. గతంలో ఈ రికార్డు చైనాలోని బీజింగ్ పేరిట ఉంది. 24 గంటల వ్యవధిలో సాధించిన బీజింగ్ రికార్డును 11 గంటల్లోనే బ్రేక్ చేయటం ఒక విశేషంగా చెప్పొచ్చు. తాజాగా ఏపీ సర్కారు చేపట్టిన కార్యక్రమంతో చైనాలోని ఒక స్వచ్ఛంద సంస్థ పేరిట మీదున్న రికార్డు బద్ధలైంది.

ఎలా సాధ్యమైంది?

మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వ్యవధిలోపు (24 గంటల సమయంలో) ఆన్ లైన్ లో అత్యధికులు నా ఇటుక నా అమరావతి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నది లక్ష్యం. ఎంతమంది ఎన్ని ఇటుకలు కొన్నారన్న దాని కంటే కూడా ఎంత మంది ఇందులో భాగస్వామ్యం అవుతారన్నది పాయింట్. దీనికి సంబంధించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరయ్యారు.

కేశినేని నేతృత్వంలో..

నా ఇటుక.. నా అమరావతికి సంబంధించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు అందరూ భాగస్వామ్యం కావాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని పిలుపునివ్వటంతో పాటు.. ఆయనే స్వయంగా ఇటుక కొనుగోలు ద్వారా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మంగళవారం తొలి ఇటుకను కొనుగోలు చేశారు. ఆయన పిలుపునకు విశేష స్పందన లభించింది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి ఇటుకల్ని కొనుగోలు చేసిన వారి సంఖ్య 50 వేలమంది అయ్యారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో 1,21,414 మంది ఆన్ లైన్ లో ఇటుకల్ని కొనేందుకు భాగస్వామ్యం కావటంతో.. పాత రికార్డు బద్ధలైంది. గిన్నిస్ రికార్డును బ్రేక్ చేయటం ద్వారా నా ఇటుక.. నా అమరావతి కార్యక్రమం మరోసారి తెరపైకి వచ్చింది.