Begin typing your search above and press return to search.

చీఫ్ జస్టిస్ మనమడు మాస్క్ తో తిరుగుతున్నాడు

By:  Tupaki Desk   |   6 Oct 2015 9:32 AM GMT
చీఫ్ జస్టిస్ మనమడు మాస్క్ తో తిరుగుతున్నాడు
X
ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా ఢిల్లీ పర్యటనకు వచ్చి.. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద ఓపెన్ ఏరియాలో గంటల కొద్దీ కూర్చోవాలన్న విషయం తెలిసి అమెరికా అధికారులు కంగు తిన్నారు. ఒకదశలో ససేమిరా అన్నా.. రిపబ్లిక్ వేడుకలకు అలా కూర్చోక తప్పదన్న మాటతో ఏమీ అనలేకపోయారు. అమెరికా అధికారులు ఒప్పుకోకపోవటానికి భద్రతా పరమైన సమస్యలు ఒక కారణం.. మరొకటి ఢిల్లీ వాతావరణ కాలుష్యం.

అమెరికా అధ్యక్షుని ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన ఆయుష్షు ఎంత తగ్గిందన్న విషయంపై కొన్ని సంస్థలు లెక్కలు కట్టి మరీ ఆ నివేదికను మీడియాకు విడుదల చేసినప్పుడు దేశ రాజధాని ఎంతలా కాలుష్య విష కౌగిలిలో చిక్కుకుపోయిందో తెలిసిందే.

తాజాగా ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కాలుష్యం దెబ్బకు తాను మాత్రమే కాదు.. తన మనమడుకూడా మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడని.. కాలుష్య బాధితుడిగా మారాడని ఆవేదన వ్యక్తం చేశారు.

చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలతో పాటు.. ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ. కాలుష్యం కారణంగా తన జీవితంలో తొలిసారి స్టెరాయిడ్లు తీసుకోవాల్సి వచ్చిందని.. తన భార్య.. కుమార్తెలు కూడా ఆస్తమాకు గురై వైద్యం చేయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాలుష్యంపై జరుగుతున్న విచారణ సందర్భంగా అత్యంత ప్రముఖులు తమ బాధలు చెప్పుకోవటం గమనార్హం. ఈ అంశాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఇదో సీరియస్ అంశంగా వ్యాఖ్యానించిన ధర్మాసనం.. దీనిపై ప్రభుత్వం నుంచి తాము సరైన స్పందన కోరుతున్నట్లు వెల్లడించారు.