Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల‌పై జస్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ కామెంట్స్ ఇవే!

By:  Tupaki Desk   |   28 Jan 2018 10:13 AM GMT
రాజ‌కీయాల‌పై జస్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ కామెంట్స్ ఇవే!
X
సుప్రీంకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి త‌ర్వాత సీనియ‌ర్ మోస్ట్ న్యాయ‌మూర్తిగా ఉన్న తెలుగు నేల‌కు చెందిన న్యాయ‌కోవిదుడు జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్‌... ఇప్పుడు దేశంలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇప్పుడైతే సుప్రీంకోర్టు వ్య‌వ‌హారాల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసి... న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఎన్న‌డూ లేని విధంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన మీడియా స‌మావేశం పెట్టి ఆయ‌న సంచ‌ల‌న‌మ‌య్యారు గానీ... గ‌తంలోనూ ముక్కుసూటి వ్య‌క్తిగా జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌ కు పేరుంది. త‌న మ‌న‌సులోని మాట‌ను - దేశానికి ఉప‌యోగప‌డే మాట‌ను నిర్మోహ‌మాటంగా కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లుగా చెప్పేసే మ‌న‌స్త‌త్వ‌మున్న న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ జాస్తికి పేరుంది. సుప్రీంకోర్టు - హైకోర్టు న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి న‌రేంద్ర మోదీ స‌ర్కారు తీసుకురాద‌ల‌చిన కొత్త చ‌ట్టంతో పాటుగా ఇటీవ‌లి కాలంలో న్యాయ వ్య‌వ‌స్థ‌లో ప్ర‌త్యేకించి దేశంలోనే అత్యున్న‌త న్యాయస్థానంగా ఉన్న సుప్రీంకోర్టులో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌పై తీవ్రంగా క‌ల‌త చెందిన జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌... మ‌రో ముగ్గురు న్యాయ‌మూర్తుల‌తో క‌లిసి చీఫ్ జ‌స్టిస్‌ పై ఏకంగా తిరుగుబావుటానే ఎగుర‌వేశార‌ని చెప్పాలి. ఇంత సంచ‌ల‌నం సృష్టించినా ఎక్క‌డ కూడా జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ క‌ట్టు త‌ప్ప‌లేద‌నే చెప్పాలి.

మొత్తానికి ఉన్న విష‌యాన్ని ఉన్న‌ట్లుగా చెప్ప‌డంతో పాటు ఆ విష‌యం స‌రైన పంథాలో న‌డుస్తుందా? లేక అప‌స‌వ్య మార్గంలో న‌డుస్తుందా? అన్న విష‌యాన్ని ఏమాత్రం తొట్రుపాటు లేకుండా చెప్పే జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ ఏ అంశంపై అయినా సంపూర్ణ అవ‌గాహ‌న‌తోనే స్పందిస్తార‌ని చెప్పాలి. మొన్న‌టికి మొన్న న్యాయ వ్య‌వ‌స్థ‌పై త‌న‌దైన శైలి కామెంట్లు చేసిన జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ తాజాగా రాజ‌కీయ రంగంపైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం దేశంలో న‌డుస్తున్న రాజ‌కీయాలేమిటి? ఆ రాజ‌కీయాల కార‌ణంగా దేశానికి ఏమైనా ఉప‌యోగం ఉందా? ఈ త‌ర‌హా రాజ‌కీయాల కార‌ణంగా ప్ర‌జాస్వామ్యం ఎలాంటి ప్ర‌మాదంలో ప‌డిపోయింది? అన్న విష‌యాల‌ను చాలా విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించిన జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌... వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై మాత్రం సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశార‌నే చెప్పాలి. నేటి ఉద‌యం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ న‌గ‌రంలోని సిద్ధార్థ క‌ళాశాల‌లో ప్రారంభమైన‌ కంట‌మ‌నేని ర‌వీంద్ర‌రావు ఫౌండేష‌న్ మూడో వార్షికోత్స‌వ స‌దస్సుకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ స‌ద‌స్సులో భాగంగా నిర్వాహ‌కులు *ప్ర‌జాస్వామ్యం... పౌర స‌మాజ బాధ్య‌త* అన్న‌ అంశంపై చ‌ర్చ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా కీల‌కోప‌న్యాసం చేసిన జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌... దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌త్యేకించి వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో సామాన్య పౌరుడి భావ‌న‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అస‌లు రాజ్యాంగం ల‌క్ష్యం ఏమిటి? ఆ ల‌క్ష్యం సిద్ధించాలంటే ఏం చేయాలి? ఆ దిశ‌గా మ‌న రాజ‌కీయాలు సాగుతున్నాయా? వార‌స‌త్వ రాజ‌కీయాల వ‌ల్ల దేశం ఏ త‌ర‌హా ప్ర‌మాదంలో ప‌డిపోయింది? అన్న అంశాల‌ను జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ ఏమాత్రం గోప్య‌త లేకుండా క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌గా చెప్పేశారు. అయినా జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ ఏమ‌న్నార‌న్న విష‌యానిక‌వ వ‌స్తే.. *దేశంలోని పౌరులంద‌రికీ స‌మాన‌త్వం వ‌ర్తింప‌జేయాల‌న్న‌ది రాజ్యాంగంలోని కీల‌క అంశం. దేశంలో ప్ర‌తి ఒక్క‌రూ అన్ని ర‌కాలుగా స‌మాన‌త్వం సాధించాల‌న్న‌ది రాజ్యాంగం ల‌క్ష్యం. మ‌న దేశంలో ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి లేదు. ఎన్నిక‌ల్లో డ‌బ్లు కీల‌క అంశం కావ‌డంతో ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డింది. వార‌స‌త్వ రాజ‌కీయాలు, అవినీతి పెరిగినందు వ‌ల్ల ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డింది* అని జ‌స్టిస్ చ‌ల‌మేశ్వర్ రాజ‌కీయాల‌పై త‌న విస్ప‌ష్ట వైఖ‌రిని ప్ర‌క‌టించేశారు.