Begin typing your search above and press return to search.

మయన్మార్ సైన్యం ఆరాచకం: మహిళలు.. చిన్నారుల్ని కాల్చేశారు

By:  Tupaki Desk   |   26 Dec 2021 5:40 AM GMT
మయన్మార్ సైన్యం ఆరాచకం: మహిళలు.. చిన్నారుల్ని కాల్చేశారు
X
ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంలోకి దూసుకెళుతున్న వేళలోనూ.. ఆటవిక రాజ్యాల్ని తలపించేలా కొన్ని దేశాలు ఉండటం తెలిసిందే. కొన్ని దేశాలు సైనికుల పాలనతో.. మరికొన్ని దేశాలు రాజులు.. నియంతల చేతుల్లో ఉండి బతుకు బండిని భారంగా.. భయంభయంగా నడపటం చూస్తున్నాం. అలాంటి దేశాల్లో మయన్మార్ ఒకటి. మనుషుల రూపంలో పిశాచాల మాదిరి వ్యవహరించే మయన్మార్ సైనికులు తాజాగా మరో మారణహోమానికి తెగబడ్డారు.

తాజాగా శరణార్థులుగా వెళుతున్న మహిళలు.. చిన్నపిల్లతో సహా 30 మందిని కాల్చి చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. అనంతరం డెడ్ బాడీల్ని సైన్యం కాల్చేసినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కయాహ్ రాష్ట్రంలోని మోసో గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్ులగా చెబుతున్నారు. సాయుధ బలగాలకు.. సైన్యానికి మధ్య పోరాటం జరుగుతుండగా శరణార్థులు శిబిరాలకు పారిపోయినట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ బలగాలు వారిని అరెస్టు చేసి.. కాల్చి చంపినట్లుగా వెల్లడించారు. అనంతరం మరణించిన వారిని నిప్పు పెట్టేయటంతో.. చనిపోయిన వారు ఎవరన్న విషయం గుర్తించలేని రీతిలో మారినట్లు చెబుతున్నారు. మరణించిన వారిని తాళ్లతో కట్టేసి.. అనంతరం వాహనాల్లో పడేసి నిప్పు పెట్టారని చెబుతున్నారు. తుపాకులతో కాల్చి చంపిన ఘోరాన్ని తాను ప్రత్యక్షంగా చూడలేదని..కాకుంటే వాటి శబ్దాల్ని తాను విన్నట్లుగా కొందరు చెబుతున్నారు. ఈ దారుణ ఉదంతం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.