Begin typing your search above and press return to search.

పిల్లల్ని కూడా చంపుతున్న మయన్మార్ సైన్యం ఇప్పటివరకు ఎంతమందంటే ?

By:  Tupaki Desk   |   4 April 2021 3:30 AM GMT
పిల్లల్ని కూడా చంపుతున్న మయన్మార్ సైన్యం ఇప్పటివరకు ఎంతమందంటే ?
X
మయన్మార్ లో ఆంగ్ ‌సాంగ్‌ సూకీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేసిన సైన్యం, దేశ పాలనను తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంగ్‌ సాంగ్‌ సూకీ సహా పలువురు రాజకీయ ప్రముఖులను సైన్యం గృహ నిర్బంధం చేసింది. అయితే ఈ పరిణామాలపై దేశ ప్రజానీకం తీవ్ర ఆగ్రహానికి గురైంది. శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు సిద్ధమైంది. దేశంలో ఎక్కడికక్కడ పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సైన్యానికి తమ నిరసనలను తెలుపుతున్నారు. ఈ పరిణామాలు సైన్యానికి కంటగింపుగా మారాయి. దీనితో ఆందోళనలు నిర్వహిస్తున్న వారిపై కి తూటాలను గురి పెడుతుంది సైన్యం.

ఈ క్రమంలోనే ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. అయితే ఇళ్లల్లో ఉన్న చిన్నారులను కూడా మయన్మార్ సైన్యం వదిలిపెట్టకపోవడం శోచనీయం. ఫిబ్రవరి ఒకటో తారీఖున దేశ పాలనను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు సైన్యం అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నిరసన కార్యక్రమాల్లో దాదాపు 536 మంది చనిపోయారు. సైనికులు జరిపిన కాల్పుల్లో వాళ్లంతా మరణించారు. వీరిలో 43 మంది బాలలు కూడా ఉన్నారంటూ సేవ్ ద చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు, నిరసనకారుల్లో భయాందోళనలను కలిగించేందుకు సైన్యం దారుణాలకు పాల్పడుతోంది. రోడ్లపైన కనిపించిన వారిని పిట్టల్లా కాల్చేస్తున్నారు.

ఈ కాల్పులకు భయపడిపోయి తన తండ్రి వద్దకు పరుగులు తీస్తున్న ఓ పాపను కూడా సైనికులు కాల్చేయడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ 13 ఏళ్ల బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా పోలీసులు కాల్పులు జరిపి మరీ ఆమెను హతమార్చారు. ఏడాది వయసున్న పాపపై కూడా కాల్పులు జరిపింది. అంతర్జాతీయ సమాజం ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సైన్యం, పోలీసులు ఎవరినీ లెక్కపెట్టడంలేదు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో మరి.