Begin typing your search above and press return to search.

మైసూరా 'సీమ ఉద్యమం' : సారథ్యం ఎవరిది?

By:  Tupaki Desk   |   27 Oct 2015 3:59 AM GMT
మైసూరా సీమ ఉద్యమం : సారథ్యం ఎవరిది?
X
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, పార్టీ వ్యూహకర్తల్లో ఒకరు అయిన మైసూరారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందనే విధంగా మాట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. మంగళవారం ఉదయం ఓ టీవీ ఛానెల్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మైసూరారెడ్డి అమరావతిని తమ పార్టీ అసలు రాజధానిగానే గుర్తించడం లేదంటూ ఘాటైన కబురు చెప్పారు. అమరావతి మీద జరుగుతున్న ఆర్భాటం వలన ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉన్నదంటూ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ఈ రాజధాని పరిణామాలు రాయలసీమ వాసులకు అసంతృప్తి కలిగిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

మైసూరా వ్యాఖ్యలను జాగ్రత్తగా విశ్లేషిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఉధృతరూపం దాల్చే అవకాశం ఉన్నదని ఎవరికైనా అనిపిస్తుంది. 'రాయలసీమ వాసుల్లో అసంతృప్తి- ప్రాంతీయ ఉద్యమం' అనే మాటల అర్థం అదే అని పలువురు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రత్యేక రాయలసీమ గురించి ఇప్పటికే పోరాటం సాగిస్తున్న వారు, పోరాడడం గురించి ఆలోచిస్తున్న వారు అందరూ కలిసి ఒక్క తాటిపైకి వస్తారా అనే ఆలోచనలు కూడా నడుస్తున్నాయి.

రాయలసీమ కోసం డిమాండు ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ వేరు పడితే గనుక.. రాయలసీమ కూడా వేరు కావడమే తప్ప.. ఆ ప్రాంత అభివృద్ధికి మరో మార్గం లేనేలేదని చాలా కాలం కిందటినుంచే తీవ్రస్థాయిలో ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేట్లయితే గనుక.. విధిగా రాయలసీమ కూడా ఇవ్వాల్సిందేనని.. లేకపోతే ఆ ప్రాంతం చాలా రకాలుగా వంచనకు గురవుతుందని సీమ నేతలు తెలంగాణ పోరాటం జరుగుతున్న రోజుల్లో కేంద్రానికి పదేపదే విజ్ఞప్తులు సమర్పించుకున్నారు. వాటిని పెడచెవిన పెట్టిన కేంద్రం తెలంగాణను మాత్రం కేటాయించింది.

కొత్త ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత అందరూ భయపడినట్లే జరిగింది. తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన ఫోకస్‌ మొత్తం అమరావతి మీద పెట్టారు. చంద్రబాబు తీరును గమనించిన లోక్‌ సత్తా జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి మేధావులు కూడా.. ఇదంతా అసలే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ లను మరింత వెనుకబాటుతనంలోకి నెడతాయని, ప్రాంతీయ ఉద్యమాలు బలపడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. దానికి తగినట్లుగానే.. ఇప్పుడు వైకాపా కీలక నేత మైసూరారెడ్డి కూడా ప్రాంతీయ ఉద్యమాల మాటెత్తుతున్నారు.

ఈ సంకేతాలన్నీ ప్రత్యేక సీమ ఉద్యమాన్నే ధ్వనింపజేస్తున్నప్పటికీ.. దానికి సారథ్యం వహించేది ఎవరు? అనే విషయమే సస్పెన్స్‌ గా ఉంది. 13 జిల్లాల రాష్ట్రాన్ని వదలుకుని నాలుగు లేదా అయిదు జిల్లాల రాష్ట్రం కోసం ఉద్యమించడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సారథ్యం వహిస్తుందా అనేది సందేహమే. అయితే ఇప్పటికే బైరెడ్డి రాజశేఖరరెడ్డి లాంటి వారు తమకు ప్రజలు, పార్టీలనుంచి లభిస్తున్న మద్దతు తక్కువే అయినా.. ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటూనే ఉన్నారు. తాజాగా తెదేపా నేత టీజీ వెంకటేష్‌ కూడా.. ప్రత్యేకసీమ ఉద్యమం సజీవంగానే ఉందని చెప్పారు. ఇప్పుడు మైసూరా మాటలు ఇలా ఉన్నాయి. మరి రాష్ట్ర ఉద్యమానికి ఎవరు సారథ్యం వహిస్తారనేది తేలాలంటే.. కొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే.