Begin typing your search above and press return to search.

ఎన్నారై జయరాంను ఎందుకు చంపారు? ఎలా చంపారో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Feb 2019 1:19 PM GMT
ఎన్నారై జయరాంను ఎందుకు చంపారు? ఎలా చంపారో తెలుసా?
X
ఎన్నారై బిజినెస్‌ మేన్ చిగురుపాటి జయరాం హత్యకేసు విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్మా, మీడియా, బ్యాంకింగ్ వ్యాపారాలు చేసి నష్టపోయి అప్పులు చేసిన జయరాంను ఎవరు హత్య చేశారు.. ఎలా చంపారన్నది పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధాలు, ఆర్థిక సంబంధాల నేపథ్యంలో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠీ మీడియాకు వెల్లడించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి, డ్రైవర్ శ్రీనివాస్‌ లను అరెస్టు చేసినట్లు చెప్పారు. జయరాంకు హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్‌ లో ఫార్మా కంపెనీ ఉంది. కానీ, అది 2015లో సమస్యల్లో చిక్కుని లాకౌట్ అయింది. దీంతో షాపూర్‌ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి, సెటిల్మెంట్లు చేసే రాకేశ్ రెడ్డిని సంప్రదించాడు జయరాం. సమస్య సెటిల్ చేయమని కోరాడు. అందుకోసం సంస్థలో డైరెక్టరుగా ఉన్న తన మేనకోడలిని సంప్రదించాలని సూచించాడు. దాంతో శిఖా, రాకేశ్ మధ్య పరిచయం పెరిగింది. జయరాం కూడా రాకేశ్ వద్ద వద్ద 4.5 కోట్ల రూపాయలకు పైగా అప్పుగా తీసుకున్నారు. పూచీకత్తుగా ఇంటిని రాసిచ్చారు. కానీ, ఆ ఇంటిపై అప్పటికే లోన్ ఉందని ఆ తరువాత రాకేశ్‌ కు తెలిసింది. దాంతో రాకేశ్ తన డబ్బు తిరిగిమ్మని జయరాంను అడగడం మొదలుపెట్టాడు. వడ్డీతో సహా 6 కోట్లు కావాలని అడిగినా జయరాం ఇవ్వలేకపోయాడు.

ఆ తరువాత రాకేశ్ జయరాంను తన డబ్బు కోసం ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోయింది. చివరకు జయరాం రాకేశ్ ఫోన్ చేసినప్పడు ఎత్తడం కూడా మానేయడంతో జయరాం రాక కోసం రాకేశ్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. శిఖాతో మంచి సంబంధాలు ఉండడంతో ఆమె సహాయంతో జయరాం జనవరి నెల 29న వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఓ మహిళ పేరుతో సిమ్ కార్డు తీసుకుని ఆ నంబరుతో జయరాంతో చాట్ చేసి ఉచ్చులోకి లాగి రాకేశ్ ఇంటికి రప్పించారు. అలా వచ్చిన జయరాంను అక్కడే బందించి తన డబ్బు కోసం ఒత్తిడి చేశాడు రాకేశ్. దగ్గరుంది జయరాంతో ఆయన స్నేహితులకు ఫోన్ చేయించి డబ్బులు అడిగించాడు. అలా చేసినా కేవలం రూ.6 లక్షలే రావడంతో ఆగ్రహించిన రాకేశ్ జయరాంను కొట్టాడు. కిందపడిపోయిన జయరాంను సోఫాకు అదిమి చంపేశాడు. తర్వాత ఈ హత్యను ప్రమాదకరంగా చిత్రీకరించాలని ఆ మృతదేహాన్ని కారులో తీసుకుని విజయవాడ హైవే పై వదిలేసి వెళ్లిపోయారని పోలీసులు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జయరాం చాలాకాలంగా అమెరికాలో ఉండేవారు. హైదరాబాద్‌ లో ఎక్స్ ప్రెస్ టీవీ అనే చానల్ పెట్టి నష్టాలు రావడంతో మూసేశారు. కోస్టల్ బ్యాంక్ అనే బ్యాంక్ పెట్టారు. హెమారస్‌ ఫార్మా కంపెనీ ఆయనదే. ఇంకా కళ్లద్దాల తయారీ కంపెనీ కూడా ఉంది. జయరాం భార్య, పిల్లలు ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు.

జయరాంకు ఆయన మేనకోడలు శిఖాతో సంబంధాలున్నాయన్న ప్రచారం ఉంది. శిఖా ప్రియుడు రాకేశ్ రెడ్డి. ఈ సంబంధాలు జయరాం హత్యలో కీలక పాత్ర పోషించాయి.