Begin typing your search above and press return to search.

కామారెడ్డిలో కాలిన శవం మిస్టరీ వెనుక ట్విస్ట్ ఇదే !

By:  Tupaki Desk   |   16 March 2021 5:30 PM GMT
కామారెడ్డిలో కాలిన శవం మిస్టరీ వెనుక ట్విస్ట్ ఇదే !
X
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కొప్పర్గ గ్రామంలో ఈ నెల 11న ఓ కాలిపోయిన శవం లభ్యం అయిన సంగతి తెలిసిందే. ఈ కాలిన శవం మిస్టరీని బోధన్‌ పోలీసులు తమ దర్యాప్తు లో అసలు నిజాల్ని బయటపెట్టారు. ఈమేరకు పట్టణంలోని బోధన్‌ రూరల్‌ సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బోధన్‌ ఏసీపీ రామారావు పూర్తి వివరాలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే .. మహారాష్ట్రలోని బిలోలి తాలుక లాడ్క గ్రామానికి చెందిన అమృత్‌ వార్‌ అశోక్‌ ను, కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మల్లపూర్‌ గ్రామానికి చెందిన బాగవ్వ కూతురు అంజమ్మకు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు.

ఆ తర్వాత అక్కడి నుండి ఇల్లరికంగా వచ్చిన అశోక్‌ కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు ఇచ్చారు. అయితే , వ్యాసనాలు, జల్సాలకు అలవాటు పడి అశోక్ ఆ భూమిని అమ్ముకొని భార్య, కూతురును ఇబ్బందులను గురిచేశాడు. దీంతో వారి కుటుంబ కలహాల గురించి పలుమార్లు పెద్దలు అశోక్‌ ను మందలించారు. అయినా అశోక్‌ తన పద్దతి మార్చుకోలేదు. ఈక్రమంలో అంజమ్మకు అన్న వరుసైన మహారాష్ట్రలోని బిలోలి తాలుక కార్లా గ్రామానికి చెందిన తొకల్‌ వార్‌ పోచయ్య అశోక్‌ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన చెల్లెలు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అశోక్‌ ను హతమార్చాలని పోచయ్య పథకం వేశాడు.

ఈక్రమంలో నిందితుడు పోచయ్య పథకం ప్రకారం అశోక్‌ ను మద్యం తాగుదామని పిలిపించి బోధన్‌ మండలంలోని కొప్పర్గ శివారులోకి తీసుకువచ్చాడు. మద్యం తాగిచ్చి మద్యం మత్తులో ఉన్న అశోక్‌ పై దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్‌ కాల్స్‌ డాటా ఆధారంగా ఈ హత్య కేసును చేధించినట్లు ఏసీపీ రామారావు వెల్లడించారు. చాకచక్యం వ్యవహరించి కేసు చేధించిన బోధన్‌ రూరల్‌ పోలీసులను ఏసీపీ రామారావు అభినందించి నగదు పురస్కారాన్ని అందజేశారు.