Begin typing your search above and press return to search.

బావిలో 9 మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ !

By:  Tupaki Desk   |   25 May 2020 3:45 AM GMT
బావిలో 9 మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ !
X
వరంగల్ శివార్లలో ఓ బావిలో 9 మృతదేహాలు లభ్యం కావడం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీసులకు సైతం ఈ కేసు ఓ సవాల్ లా మారింది. అయితే, వరంగల్ జిల్లా పోలీసులు ఎంతో సమర్థంగా వ్యవహరించడంతో ఈ కేసులో చిక్కుముడిని మూడు రోజులకే విప్పగలిగారు. హతురాలైన బుస్రా ప్రియుడు సంజయ్ కుమార్ యాదవ్ తన స్నేహితులతో కలిసి ఈ సామూహిక హత్యలకు పాల్పడినట్లు సమాచారం. కూల్ డ్రింక్స్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిని బావిలో పడేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.

ఈ కేసులో మొదట గురువారం నాలుగు మృతదేహాలు బావిలో తేలాయి. శుక్రవారం మరో ఐదు శవాలు బావిలో వెలుగు చూశాయి. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. దీంతో వరంగల్ పోలీసులు ఆరు బృందాలుగా రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. కాగా, పశ్చిమబెంగాల్‌ కు చెందిన ఎండీ మక్సూద్ దాదాపు 20 ఏళ్ళ క్రితం కుటుంబంతోపాటు వరంగల్ ‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. డిసెంబర్ నెల నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా వరంగల్ నుంచి రాకపోకలు ఇబ్బందిగా ఉండటంతో నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన బుస్రా కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితోపాటు గోడౌన్ పక్కనే ఉన్న భవనంలో బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యాం, పశ్చిమబెంగాల్ కు చెందిన షకీల్ లు కూడా నివసిస్తూ గోదాంలో ఉంటున్నారు.

అయితే, భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుస్రా నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈ వ్యవహారంలో తల్లికి ఆమెకి గొడవలు అయినట్లు తెలుస్తుంది. అలాగే బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యాంలు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసినట్లు చెబుతున్నారు. దీనితో ఒక పథకం ప్రకారమే .. కూల్ డ్రింకులో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహలో లేరని నిర్ధారించుకున్న తర్వాత బావిలో పడేసినట్టు విచారణలో తేలింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను ఈ రోజు మీడియా ముందుకు తీసుకువస్తారని తెలుస్తోంది.