Begin typing your search above and press return to search.

విక్ర‌మ్ గౌడ్ కేసులో కొత్త ట్విస్ట్‌..

By:  Tupaki Desk   |   31 July 2017 6:17 AM GMT
విక్ర‌మ్ గౌడ్ కేసులో కొత్త ట్విస్ట్‌..
X
మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు విక్రమ్‌ గౌడ్ కాల్పుల కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కాల్పులకు ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురం జిల్లాకు లింకు దొరికింది. ఈ అనుమానంపై ప్రత్యేక బృందం అనంతపురం వెళ్లింది. ప్లాన్ ప్రకారమే విక్రమ్‌ గౌడ్‌ పై కాల్పులు జరిగాయనే అనుమానాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయని అంటున్నారు. విక్రమ్‌ గౌడ్ సెల్‌ ఫోన్ కాల్‌ డాటాను విశ్లేషిస్తుండగా ఘటన జరిగిన రోజు రాత్రి ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి సెల్‌ ఫోన్ నుంచి మూడుకాల్స్ వచ్చినట్టు గుర్తించారు. ఆ వ్యక్తి ఆచూకీ కోసం అనంతపురంలో పోలీసులు గాలిస్తున్నారు. అతడు దొరికితే మరికొంత సమాచారం వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో లభ్యమైన ఆధారాలతో విక్రమ్‌ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన తర్వాత ఆ గన్‌ ను అనంతపూర్ జిల్లా కు చెందిన వ్యక్తికే ఇచ్చి పంపించి ఉంటాడనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారని విక్రమ్‌ గౌడ్ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాలపై పోలీసులు ఆరా తీశారు. దర్గా సమీపం నుంచి ఒక ద్విచక్రవాహనం అనుమానాస్పదంగా వెళ్లిన విషయం సీసీ కెమెరాల్లో రికార్డయింది. వాహనం నంబర్ స్పష్టంగా కనిపించకపోవడంతో దానిని సీపీ కార్యాలయంలోని వీడియో ఎన్‌ హాన్స్‌ మెంట్ విభాగానికి పంపించి స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. అనంతపురానికి చెందిన వ్యక్తులే ఆ వాహనంపై వచ్చి ఉంటారని, ప్లాన్‌లో భాగంగానే తన స్నేహితులు వస్తారని, గేట్‌కు తాళం వేయెద్దని విక్రమ్‌గౌడ్ వాచ్‌మెన్‌కు చెప్పారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఒక కెమెరాలో మాత్రం నల్లరంగు కారు ఇంటినుంచి వెళ్లినట్లు కనిపించిందని చెబుతున్నారు. అయితే ఆ కారుకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వీడియోను అనాలసిస్ సెంటర్ కు పంపించారు.

అయితే వచ్చిన వారు తుపాకీతో వచ్చి విక్రమ్‌ గౌడ్‌ ను దగ్గరి నుంచి కాల్చారా? లేదా వారు తుపాకీని విక్రమ్‌ గౌడ్‌ కు ఇవ్వడంతో స్వయంగా రెండు చేతులపై కాల్చుకున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికఇబ్బందులు ఉండటంతో అప్పుల వాళ్లతోపాటు కుటుంబసభ్యులకు ఝలక్ ఇచ్చేందుకు విక్రమ్‌ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అయితే, బెదిరింపుల కోసమైతే తుపాకీ వాడాల్సిన అవసరం లేదని, దీని వెనుక మరెదో బలమైన కారణం ఉండవచ్చనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు పది ప్రత్యేక బృందాలు మూడురోజులుగా శ్రమిస్తున్నాయి.