Begin typing your search above and press return to search.
వీడిన విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ!
By: Tupaki Desk | 31 July 2017 2:12 PM GMTరాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనుకున్న ప్రతిపక్ష నాయకుడు ప్రజల నుంచి సింపతీ కొట్టేయడానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు....తన మీద హత్యా ప్రయత్నం చేయడానికి సుపారీ ఇవ్వమని తన అనుచరుడికి పురమాయిస్తాడు.....డబుల్ గేమ్ ఆడిన ఆ అనుచరుడు నిజంగానే ఆ ప్రతిపక్ష నాయకుడిని వేరే వ్యక్తితో చంపించేస్తాడు... ఇది టూకీగా అతడు సినిమాలోని సింపతీ మర్డర్ ప్లాన్! ఈ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన ఓ మాజీ మంత్రి కుమారుడు నిజ జీవితంలో ఆ సింపతీ మర్డర్ ప్లాన్ అమలు చేయాలనుకున్నాడా? ఆ ప్లాన్ ఫెయిలవడంతో చివరికి పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడా? అటు సింపతీ దక్కక పోగా...కటకటాలలోకి వెళ్లవలసిన పరిస్థితిని స్వయంగా కల్పించుకున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు వస్తున్నాయి. హైదరాబాద్ లో సంచలనం రేపిన కాల్పుల ఘటనలో బాధితుడు, నిందితుడు విక్రమ్ గౌడేనని పోలీసులు తేల్చారు. తనపై కాల్పులు జరపమని అనంతపురానికి చెందిన నలుగురు వ్యక్తులకు స్వయంగా విక్రమ్ గౌడ్ సుపారీ ఇచ్చాడని పోలీసుల విచారణలోతేలింది.
హైదరాబాద్ లో కలకలం రేపిన మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా విక్రమ్ గౌడ్ తన పై కాల్పులు జరపమని డబ్బులు ఇచ్చాడని నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నాలుగో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాలుగో నిందితుడిని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ అనంతపురం వెళ్లింది. పోలీసులను తప్పుదోవ పట్టించిన విక్రమ్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
మొదటి నుంచి ఈ కాల్పుల ఘటన సినీ డ్రామాను తలపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల కథలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూసింది. మొదట విక్రమ్ గౌడ్ అప్పుల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని పోలీసులు భావించారు. విక్రమ్ గౌడ్ చేతికి గన్ పౌడర్ అంటడం, అతడి ఇంట్లోని సీసీ టీవీ కెమెరాల్లో బయటి వ్యక్తుల కదలికలు కనిపించకపోవడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే, మొదటి నుంచి విక్రమ్ గౌడ్, అతడి భార్య షిఫాలీ చెబుతున్న సమాధానాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అయితే, ఈ ఘటనలో కాల్పులకు ఉపయోగించిన తుపాకీ కీలకంగా మారింది. అది పోలీసులకు ఇంతవరకు లభించలేదు. విక్రమ్ గౌడ్ తనను తాను కాల్చుకున్నాడా? లేదా? అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఆ విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు ఈ కేసులో లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.