Begin typing your search above and press return to search.

రాజకీయ జీవితమంతా ఇంతేనా ?

By:  Tupaki Desk   |   24 July 2021 5:35 AM GMT
రాజకీయ జీవితమంతా ఇంతేనా ?
X
కొందరి రాజకీయ నాయకుల జీవితం స్వయం తప్పిదాల వల్ల మధ్యలో గందరగోళంగా తయారవుతుంది. అలాంటి వారిలో ఒకరు రాజకీయంగా అవుట్ డేటెడ్ అయిన సీనియర్ నేత మైసూరారెడ్డి. కడప జిల్లాకు చెందిన ఈయన ప్రస్తుతం రాజకీయ ప్రభ కోల్పోయారు. రాంగ్ టైమింగ్ లో ఆయన చేసిన జంపింగ్ లే దీనికి ప్రధాన కారణం. ఒకపుడు ఈ రెడ్డిగారు కాంగ్రెస్, టీడీపీల్లో బాగానే వెలిగారు. అయితే నిత్య అసంతృప్తి కారణంగా తొందరగానే యాక్టివ్ రాజకీయాల నుండి బయటకు వెళిపోయారు.

ఏ పార్టీలో ఉన్నా పదవులు తనకే కావాలనే మనస్తత్వం కారణంగానే ఆయన అన్ని పార్టీలకు దూరమైపోయారు. అయితే ఇదంతా ఇపుడు ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే ఆయన తాజాగా ఒక విచిత్రమైన డిమాండ్ బయటపెట్టారు. చాలాచాలం నుండి వార్తల్లోనే కనిపించని మైసూరా చివరకు రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలపై ఆరోపణలు, విమర్శలు చేయటం ద్వారా మీడియాలో కాస్త స్పేస్ సంపదించుకున్నారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతుందని చాలామంది చెప్పిన సలహానే ఈయన కూడా ఇచ్చేశారు. నిజానికి కేటాయింపులకు మించి, అక్రమంగా ప్రాజెక్టుల నుండి నీటిని వాడేసుకున్నది తెలంగాణా ప్రభుత్వం. ఈ విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా కూర్చుని మాట్లాడుదామని ఏపి మంత్రి అనీల్ కుమార్, కొడాలినాని సూచించినా తెలంగాణా మంత్రులు పట్టిచుకోలేదు. పైగా ఏపి అభ్యంతరాలు చెప్పినా వినకుండా కేసీయార్ జల విద్యుత్ ఉత్పత్తి కూడా చేసేశారు.

తెలంగాణా ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను మార్చటం సాధ్యం కాదని అర్ధమైన తర్వాతే జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. కేంద్రం కూడా స్పందిచకపోవటంతో సుప్రింకోర్టులో కేసు వేశారు. మొత్తానికి జగన్ ఫిర్యాదులు కావచ్చు లేదా సుప్రింకోర్టులో కేసు వల్ల కావచ్చు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను కేంద్రం తన పరిధిలోకి తీసేసుకుంటు గెజెట్ జారీచేసింది. అయితే గెజెట్ లో కొన్ని తప్పులున్నాన్న విషయాన్ని నిపుణులు గ్రహించారు. తప్పులను ఎత్తిచూపుతు సవరణలు కావాలని ఏపి ప్రభుత్వం మళ్ళీ కేంద్రానికి లేఖరాసింది.

కళ్ళముందు జరుగుతున్నది చూసిన తర్వాత మైసూరా సీఎంపై ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి చేసినట్లుంది. జగన్ వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోందనటమే ఆశ్చర్యం. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నాడని, రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తమ రాష్ట్రం నష్టపోతుందని తెలంగాణా మంత్రులు జగన్ పై మండిపడుతున్నది వాస్తవం కాదా. పై రెండు ప్రాజెక్టులు రాయలసీమలోనివే కదా. ఇక రాయలసీమలోని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా జరుగుతునే ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే రాజ్యసభ ఎంపి విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో పొసగని కారణంగానే కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చేశారు మైసూరా. తర్వాత టీడీపీలో చేరి రాజ్యసభ ఎంసి అయ్యారు. మళ్ళీ రెండోసారి చాన్స్ దక్కకపోవటంతో చంద్రబాబునాయుడు మీద అలిగి వైసీపీలో చేరారు. వైసీపీలో రాజ్యసభ ఎంపి అవకాశం రాకపోవటంతో జగన్ మీద అలిగి బయటకు వచ్చేశారు. ఇక చేరటానికి ఏపార్టీ లేక, మాట్లాడటానికి ఏ సబ్జెక్టు లేకపోవటంతో రాయలసీమ జలాలని, గ్రేటర్ రాయలసీమ రాష్ట్రమని ఏదేదో మాట్లాడుతున్నారు. మొత్తం మీద మైసూరా రాజకీయ జీవితం చూస్తే నిత్యం అసంతృప్తే కనబడుతుంది.