Begin typing your search above and press return to search.
ఆలయానికే విరాళమిచ్చిన యాచకురాలు!
By: Tupaki Desk | 21 Nov 2017 11:31 AM GMTఈ మధ్య కాలంలో హైటెక్ బెగ్గర్స్ గురించి తరచూ వార్తలు వింటున్నాం. పని చేయడానికి ఒళ్లు బద్దకించి బిచ్చగాళ్లుగా మారి లక్షల రూపాయలు సంపాదించిన వారి గురించి విన్నాం. తమ దేశానికి వెళ్లడం ఇష్టం లేక ఇక్కడే భిక్షాటన చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఓ రష్యా యువకుడి గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, మానసిక ప్రశాంతత కోసం హైదరాబాద్ లో బిచ్చమెత్తుకుంటున్నామని, తాము కోటీశ్వరులమని ఇద్దరు మహిళలు అందరికీ షాక్ ఇచ్చారు. అయితే, వీరందరికీ భిన్నంగా మైసూరుకు చెందిన ఓ వృద్ధ యాచకురాలు తాను భిక్షాటన చేస్తున్న దేవాలయానికే డబ్బులు డొనేషన్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. తనకు బిచ్చమెత్తుకొని సంపాదించిన రూ.2.5 లక్షలను ఆ దేవాలయానికి విరాళంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎంవీ సీతా లక్ష్మి(85) అనే వృద్ధురాలు 10 సంవత్సరాల క్రితం వరకు ఇళ్లలో పనిమనిషిగా పనిచేసింది. ఒంట్లో శక్తి సన్నగిల్లడంతో మైసూరులోని ఒంటికొప్పోల్ లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఎదుట ప్రతిరోజూ భిక్షాటన చేస్తోంది. భక్తులు తనకు దానం చేసిన డబ్బును ఆమె జాగ్రత్తగా బ్యాంకులో దాచిపెట్టుకుంది. ఆ విధంగా జమ అయిన రూ.2.5 లక్షల సొమ్మును ఆమె దేవాలయానికి విరాళంగా ఇచ్చింది. దేవాలయంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు, ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజున భక్తులకు అన్నదానం చేసేందుకు ఆ డబ్బును వినియోగించాలని కోరింది. తనకు భగవంతుడు ఇచ్చిన సొమ్మును ఆయనకే ఖర్చు పెట్టాలనుకున్నానని, ఆలయ సిబ్బంది తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని సీతా లక్ష్మి చెప్పింది. సీతా లక్ష్మి అందరు యాచకుల్లా కాదని, భక్తులు ఇచ్చినంత సొమ్మును స్వీకరిస్తుందని, డిమాండ్ చేయదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆమె విరాళం ఇచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు...ఆమెకు ఎక్కువగా డబ్బు దానం చేస్తున్నారని, కొందరు ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారని చెప్పారు. తమ ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆమెను సన్మానించారని తెలిపారు. ఆమె తన సోదరుడితో పాటు నివసిస్తోంది. కొద్ది రోజు క్రితం ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందని, తమకు సాధ్యమైనంతలో చికిత్స చేయించి మందులు వాడుతున్నామని సీతా లక్ష్మి సోదరుడు చెప్పారు. ఆమె తనతో పాటే ఉంటోందని, ఉదయం గుడికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుందని తెలిపారు.