Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ లో పంది కొవ్వు..అపోహలు పోగొట్టడానికి టీకా వేసుకున్న సౌదీ యువరాజు!

By:  Tupaki Desk   |   26 Dec 2020 9:38 AM
వ్యాక్సిన్ లో పంది కొవ్వు..అపోహలు పోగొట్టడానికి టీకా వేసుకున్న సౌదీ యువరాజు!
X
కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్లు ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వస్తున్నాయి. అయితే , ప్రస్తుతం మార్కెట్ లోకి వచ్చిన , వస్తున్నా కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో ఎన్నో అపోహలు మెదులుతున్నాయి. వాటిని నివృతి చేయడానికి పలువురు దేశాధినేతలు ముందుకొచ్చి టీకా వేయించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తదితరులు టీకా తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో సౌదీ యువరాజు చేరారు.

సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ శుక్రవారం కరోనా‌ టీకాను వేయించుకున్నారు. యువరాజు చూపిన చొరపై సౌదీ ఆరోగ్య మంత్రి ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజల్లో భరోసా నింపేందుకు యువరాజు చొరవ తీసుకోవడం అభినందనీయమని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ తాఫిఖ్‌ అల్‌-రబియా వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ సంస్థ బయోఎన్ ‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కరోనా వైరస్‌ టీకా అత్యవసర వినియోగానికి సౌదీ కూడా అనుమతించింది. ఈ నేపథ్యంలో టీకా డోసులు ఇటీవల అమెరికా నుంచి సౌదీ అరేబియాకు చేరాయి. దీంతో ప్రజలందరికీ వీలైనంత త్వరగా టీకా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

యువరాజు టీకా తీసుకున్న దృశ్యాలను అరబ్ న్యూస్ ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది. యువరాజుకు తొలి డోస్ ఇచ్చినట్టు వెల్లడించింది. మరోవైపు, కోవిడ్-19 టీకాలో పోర్క్ జిలాటిన్ ఉన్నట్లు వెల్లడికావడంతో ముస్లింలలో ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై యూఏఈ ఫత్వా కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దల్లా బిన్ బయ్యా మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాక్సిన్లు ఇస్లాం పోర్క్ ఆంక్షల పరిధిలోకి రావని పేర్కొన్నారు. మనిషి ప్రాణాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. వ్యాక్సిన్లలోని పోర్క్ జిలాటిన్ ను ఔషధంగా పరిగణించాలని, దానిని ఆహారంగా భావించరాదని వివరించారు.