Begin typing your search above and press return to search.

నాదెండ్ల సంచ‌ల‌నం!..ఎన్టీఆర్ రౌడీల‌ను అడిగార‌ట‌!

By:  Tupaki Desk   |   13 Jan 2019 1:42 PM GMT
నాదెండ్ల సంచ‌ల‌నం!..ఎన్టీఆర్ రౌడీల‌ను అడిగార‌ట‌!
X
తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు, తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, తెలుగు నేల‌లో సంక్షేమ రాజ్యానికి శ్రీ‌కారం చుట్టిన దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ఇప్ప‌టిదాకా ఏ ఒక్క‌రు కూడా అంత దిగ‌జారి మాట్లాడింది లేదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సంద‌ర్భంగా ఇప్ప‌టి పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఓ మోస్త‌రు విమ‌ర్శ‌లు చేసి ఊరుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవ‌డం, ఆయ‌న‌కు రెండో భార్య‌గా ఎంట్రీ ఇచ్చిన ల‌క్ష్మీపార్వ‌తి పార్టీ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డాన్ని భ‌రించ‌లేక‌పోయామ‌ని చెప్పిన బాబు అండ్ కో... ఆ కార‌ణంగానే ఆయ‌న నుంచి పార్టీని లాగేసుకోవాల్సి వ‌చ్చింద‌ని కూడా చెప్పుకొచ్చారు. అంత‌కుమించి ఎన్టీఆర్‌పై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేసింది లేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఎన్టీఆర్- క‌థానాయ‌కుడు నేప‌థ్యంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన రెండో కోణం ఏద‌న్న విష‌యంపై ఓ మోస్త‌రు స్థాయిలో చ‌ర్చకు తెర లేసింది. న‌టుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్ కూడా మ‌నిషేన‌ని, ఓ మంచి న‌టుడిగా త‌మ‌కు ఆయ‌నంటే ఇప్ప‌టికీ ఆరాధ‌నీయ‌మేన‌ని చెబుతున్న జ‌నం... బ‌యోపిక్‌లో ఆయ‌న‌ను ఏకంగా దేవుడిని చేసి చూప‌డంపై ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కంటే ముందు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన‌ట్టుగా భావిస్తున్న మాజీ సీఎం నాదెండ్ల భాస్క‌ర‌రావు... మొన్నామ‌ధ్య మీడియా ముందుకు వ‌చ్చి... సినిమాలో త‌న‌ను విల‌న్‌గా చూపిస్తే స‌హించేది లేద‌ని ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న ఏకంగా చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, సెన్సార్ బోర్డుల‌కు లీగ‌ల్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే బ‌యోపిక్ తొలి పార్ట్ రిలీజ్ కావడం, అందులో త‌న‌ పాత్ర లేక‌పోవ‌డంతో నాదెండ్ల సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే నాదెండ్ల, చంద్ర‌బాబు పాత్ర‌లు లేకుండా పూర్తి కాదు క‌దా. చంద్ర‌బాబేమో కూతురును పెళ్లి చేసుకున్న అల్లుడాయే.. మ‌రి నాదెండ్ల దూర‌మే క‌దా. అందుకే బ‌యోపిక్ రెండో పార్ట్‌గా రానున్న ఎన్టీఆర్- మ‌హానాయ‌కుడులో చంద్ర‌బాబు వెన్నుపోటును వ‌దిలేసి... నాదెండ్ల వెన్నుపోటును మాత్రం త‌ప్ప‌క చూపిస్తార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈక్ర‌మంలో ఈ మ‌ధ్య ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాదెండ్ల... ఎన్టీఆర్ గురించి చాలా విష‌యాలే మాట్లాడారు. అస‌లు ఎన్టీఆర్ ప‌ట్ల త‌మ కుటుంబం ఏ భావన‌తో ఉన్న‌ద‌న్న విష‌యాన్ని కూడా నాదెండ్ల కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంతేకాదండోయ్‌... ఎన్టీఆర్ లోని మ‌రో కోణాన్ని కూడా ఆయ‌న ఆవిష్క‌రించేశారు. పార్టీ పెట్టే స‌మ‌యంలో రౌడీల సాయాన్ని తీసుకుందామ‌న్న కోణంలో నాదెండ్ల వ‌ద్ద ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశార‌ట‌. విజ‌య‌వాడ‌లో నీకెంత మంది రౌడీలు ఉన్నారు? అవ‌స‌ర‌మైతే.. ఎంత‌మంది రౌడీల‌కు తీసుకురాగ‌ల‌రు?* అని నాదెండ్ల‌ను ఎన్టీఆర్ స్వ‌యంగా అడిగార‌ట‌. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నాదెండ్ల ఇవేంమాట‌లండీ బాబూ అంటూ ఎన్టీఆర్ రౌడీ వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

అస‌లు సినిమా జ‌నాల‌పై, ఆ తాను నుంచే వ‌చ్చిన ఎన్టీఆర్ ప‌ట్ల నాదెండ్ల కుటుంబానికి ఎలాంటి భావ‌న ఉండేద‌న్న విష‌యంపైనా నాదెండ్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ లాంటి తక్కువ స్థాయి వ్య‌క్తితో తిర‌గ‌మేమిట‌ని త‌న తండ్రి త‌న‌ను దాదాపుగా నిల‌దీసినంత ప‌నిచేశార‌ని చెప్పిన నాదెండ్ల‌... ఎన్టీఆర్‌ను ఇంటికి మాత్రం తీసుకురావ‌ద్ద‌ని, అలాంటి త‌క్కువ స్థాయి వ్య‌క్తుల‌తో తిరిగి మ‌న‌ల‌ని మ‌నం త‌క్కువ చేసుకున్న‌ట్లే క‌దా అని త‌న తండ్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేవార‌ట‌. అస‌లు ఎన్టీఆర్‌తో భేటీ అంటేనే... త‌న తండ్రితో పాటు త‌న భార్య కూడా ఇష్ట‌ప‌డేవారు కాద‌ని, ఎన్టీఆర్‌తో నీకు స‌మావేశాలేంటీ? అని నిల‌దీసేవార‌ని కూడా ఆయ‌న గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ పేరు వింటేనే నాదెండ్ల తండ్రి ఛీ... ఛీ అనేవార‌ట‌.ఇక పార్టీ వ్య‌వ‌హారాల‌కు వ‌స్తే... తెలుగు దేశం పార్టీ అనే పేరును తామంతా తిర‌స్క‌రించామ‌ని, అయినా కూడా ఎన్టీఆర్ త‌మ మాట‌ను ప‌ట్టించుకోకుండా అదే పేరును ప్ర‌క‌టించేశార‌ని నాదెండ్ల చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఆయ‌న కుటుంబం, తెలుగు త‌మ్ముళ్లు దేవుడిగా చిత్రీక‌రిస్తుంటే... నాడు నాదెండ్ల ఫ్యామిలీ మాత్రం ఎంత చీఫ్‌ గా చూసింద‌న్న విష‌యం బ‌య‌ట‌కు రావడం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.