Begin typing your search above and press return to search.

రామోజీరావుకు రాజ్యసభ...నాదెండ్ల చెప్పిన పాత ముచ్చట...

By:  Tupaki Desk   |   25 Oct 2022 12:50 PM GMT
రామోజీరావుకు రాజ్యసభ...నాదెండ్ల చెప్పిన పాత ముచ్చట...
X
మీడియా మొఘల్ గా రాణిస్తున్న వారు చెరుకూరి రామోజీరావు. తెలుగు పత్రికారంగానికి కొత్త ఒరవడిని తీర్చిదిద్దిన వారిగా ఆయనను చెప్పుకుంటారు ఆయన అనేక ఇతర రంగాలలో సైతం రాణించారు. అయితే రామోజీరావు 1974 లో ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఆ తరువాత దేశంలో ఏమర్జెన్సీ వచ్చింది. నాడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటిగా నిలిచింది. పత్రికా స్వేచ్చను హరించే చర్యలు నాడు తీసుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రంలో నాడు ధైర్యంగా ఈనాడుతో పాటు ఆంధ్రప్రభ వంటి పత్రికలు వాస్తవాలు రాశాయి. ఆ తరువాత రోజులల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రాజకీయం మొదలైంది.

దేశంలో 1977లో జనతా ప్రభుత్వం వచ్చింది. అపుడే ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఒక్క చోట చేరి ఓడించాలని ప్రయత్నం జరిగింది. అయితే జనతా 1978లో జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే ఇందిరాగాంధీ నాయకత్వాన కాంగ్రెస్ ఐ కి 175 సీట్లు దక్కాయి. అయితే జనతాకు నాడు 60 సీట్లు, రెడ్డి కాంగ్రెస్ కి 30 సీట్లు దక్కాయి. అంటే బలమైన విపక్షం వైపు తెలుగు జనాలు తొలిసారిగా మొగ్గు చూపినట్లుగా అర్ధమైంది. దాంతో పరిస్థితిని గమనించిన నాదెండ్ల భాస్కరరావు లాంటి వారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఎన్టీయార్ ని 1978 ఎన్నికల టైం లోనే రాజకీయాల్లకి రమ్మని చాలామంది కోరినా ఆయన 60 ఏళ్ళు నిండితేనే రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి ఆ మాట ప్రకారం 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్టీయార్ తో నాదెండ్ల కలసి తెలుగుదేశం పార్టీని నిర్మించి జనంలోకి తీసుకెళ్లారు. ఈ విషయాలు అన్నీ కూడా నాదెండ్ల భాస్కరరావు తాజాగా ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా ఈ ఇద్దరూ రాజకీయ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న వేళ వారితో రామోజీరావు కూడా జత కలిశారట. ఆ ముచ్చట్లు నాదెండ్ల చెబుతూ తనకూ ఎన్టీయార్ కి ఒకసారి రామోజీరావు నుంచి ఆహ్వానం వచ్చిందని, తమ ఇద్దరిని ఆయన ఆతీధ్యానికి పిలిచారని చెప్పుకొచ్చారు. టీడీపీకి మీడియా తరఫున రామోజీరావు సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు ఆ తరువాత టీడీపీ ఎన్నికల్లో గెలిచిందని, దానికి ప్రతిగా రామోజీరావుకు రాజ్యసభ సభ్యత్వం ఇద్దామని తానూ ఎన్టీయార్ అనుకున్నామని, దీని మీద తమ మధ్య డిస్కషన్ కూడా జరిగిందని నాదెండ్ల ఆసక్తికరమైన విషయాలనే చెప్పారు.

ఇదే విషయాన్ని తాము రామోజీరావుకు తెలియచేయగా ఆయన సున్నితంగా తనకు ఈ పదవులు వద్దు అంటూ తిరస్కరించారని నాదెండ్ల చెప్పారు. మొత్తం మీద చూస్తే రామోజీరావుకు టీడీపీ తరఫున రాజ్యసభ సీటు ఆఫర్ చేయడం ఆయన వద్దు అని చెప్పడం అన్న విషయాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.