Begin typing your search above and press return to search.

బీజేపీలోకి మాజీ సీఎం... రిటైర్డ్ ఐఏఎస్ కూడా

By:  Tupaki Desk   |   6 July 2019 4:33 PM GMT
బీజేపీలోకి మాజీ సీఎం... రిటైర్డ్ ఐఏఎస్ కూడా
X
గడచిన రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న ఉమ్మడి ఏపీకి ఓ నెల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నాదెండ్ల భాస్కరరావు బీజేపీలోకి చేరిక ఎట్టకేలకు కాసేపటి క్రితం పూర్తి అయ్యింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో నాదెండ్ల కాషాయ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ చేరిక సందర్భంగా నాదెండ్లతో పాటుగా ఐఏఎస్ గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయిన చంద్రవదన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అమిత్ షా హైదరాబాద్ కు రాగా... ఆయన సమక్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు వేచి చూసిన నాదెండ్ల తన రాజకీయ పునరాగమనాన్ని ఘనంగానే చాటుకున్నారని చెప్పాలి.

తెలుగు నేల రాజకీయాల్లో తనదైన శైలి సంచలనం సృష్టించిన దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు ఆయన వెన్నంటి ఉండి... వైద్య చికిత్సల కోసం ఎన్టీఆర్ అమెరికా వెళితే... సందర్భం చూసుకుని సీఎం గద్దెనెక్కిన నాదెండ్ల అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. అయితే అమెరికా నుంచి తిరిగి రాగానే ఎన్టీఆర్ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిన నాదెండ్ల సీఎం పీఠం నుంచి దిగక తప్పలేదు. సో... రాజకీయాల్లో అత్యల్ప కాలమే ఉన్న నాదెండ్ల... కేవలం నెల రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా కనుమరుగు అయిన నాాదెండ్ల.. ఎన్నికల సమయంలో ఓటేసేందుకు మాత్రమే బయటకు వచ్చి కనబడేవారు. నాదెండ్ల వారసుడిగా ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి దివంగత సీఎం వైఎస్ హయాంలో స్పీికర్ గా తనదైన ముద్ర వేశారు. అయితే వైఎస్ మరణానంతరం మనోహర్ కూడా రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్నంత పనిచేశారు.

మరి ఇలాంటి నేపథ్యం ఉన్న నాదెండ్ల ఫ్యామిలీ నుంచి మాజీ సీఎం హోదా ఉన్న భాస్కరరావును చేర్చుకోవడం ద్వారా బీజేపీ ఏం లాభపడాలనుకుంటుందోనన్న విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. ఇక విధి నిర్వహణలో పెద్దగా పేరు ప్రఖ్యాతులేమీ సాధించని చంద్రవన్ రిటైర్డ్ ఐఏఎస్ గా మాత్రమే తెలుసు గానీ... ఆయన పెద్దగా సాధించినదేమీ లేదు. ఇలాంటి రిటైర్డ్ ఐఏఎస్ ను కూడా చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో ఎవరు వచ్చినా కండువా కప్పేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా బీజేపీ తన వైఖరిని బయటపెట్టేసుకుందన్న వాదన వినిపిస్తోంది.