Begin typing your search above and press return to search.

బీజేపీలోకి మాజీ సీఎం..!?

By:  Tupaki Desk   |   4 July 2019 6:22 AM GMT
బీజేపీలోకి మాజీ సీఎం..!?
X
అధికారమే పరమావధిగా ప్రస్తుత రాజకీయాలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వంలో అధికారం చెలాయించిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ ఓడిపోయాక నెల రోజులు కూడా ఆగలేక అధికార బీజేపీలో చేరిపోయారు. ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నాయిప్పుడు..

ఇక ఏపీలో తమ ప్రత్యర్థి అయిన టీడీపీని బలహీన పరచడం.. అదే సమయంలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ కీలక నేతలందరినీ లాగేయడానికి శతవిధాల ప్రయాత్నాలు చేస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ లో వెలుగువెలిగిన నేతలపై దృష్టి సారించి వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు రెడీ అయ్యింది.

తాజాగా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అయిన నాదెండ్ల భాస్కర్ రావును బీజేపీలోకి చేర్చుకునేందుకు కమలదళం చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ ఫోకస్ నాందెడ్ల కుమారుడు మనోహర్ పైనే ఉంది. ఆయనను భాస్కర్ రావు ద్వారా ఒత్తిడి తెచ్చి బీజేపీలో చేర్చుకోవాలన్నదే ప్లాన్ అట..

నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పవన్ స్థాపించిన జనసేనలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. పవన్ తోపాటు కుడిభుజంగా ప్రతీ కార్యక్రమంలోనూ కనిపిస్తున్నారు. అయితే ఇటు పవన్, అటు మనోహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. భవిష్యత్ లో జనసేన పై నమ్మకం కూడా సన్నగిల్లుతోంది. అందుకే నాదెండ్ల భాస్కర్ రావును బీజేపీలో చేర్చుకొని ఆయన కొడుకుకు గాలం వేయాలని బీజేపీ యోచిస్తోందట..

వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీని తుత్తునియలు చేసి అధికార వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదగాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకే టీడీపీ - కాంగ్రెస్ నేతలను భారీగా చేర్చుకొని రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తోంది. దీనికోసం ఇతర పార్టీల్లోని బలమైన నేతలపై కన్నేస్తోంది. మరి పవన్ కు అత్యంత సన్నిహితుడైన నాదెండ్ల మనోహర్ తండ్రి మాట వింటాడా.? జగన్ వెంట నడుస్తాడా అన్నది వేచిచూడాలి.