Begin typing your search above and press return to search.

ఇలాంటి సీన్.. రాజకీయాల్లోనే కనిపిస్తుంది?

By:  Tupaki Desk   |   31 March 2021 7:29 AM GMT
ఇలాంటి సీన్.. రాజకీయాల్లోనే కనిపిస్తుంది?
X
కాలమహిహ కాకుంటే దీన్నేమనాలి? భిన్న ధ్రువాలు ఒకే అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నించటమా? చారిత్రక వైరుధ్యాల్ని వదిలేసి.. కలిసి పని చేయటాన్ని తెలుగు ప్రజలు ఎప్పుడైనా కల కన్నారా? ఇలాంటి అరుదైన దృశ్యం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. మీరు గమనించారో లేదో? ఏపీలో జరుగుతున్న తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అరుదైన సీన్ ఒకటి చోటు చేసుకుంది.

అందరి చూపు అభ్యర్థుల పైనా.. వారి గెలుపుపైనా ఫోకస్ అయి ఉంది. కానీ.. రాజకీయాల్లో మాత్రమే సాధ్యమయ్యే పరిణామం ఒకటి అక్కడ నిశ్శబ్దంగా చోటు చేసుకుంది. తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ.. జనసేనలు కలిసి పని చేయాలని భావించటం.. బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపితే.. జనసేన వారికి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించటం తెలిసిందే.

అయితే.. బీజేపీ తరఫున పని చేస్తున్న ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి.. జనసేనలో కీలక భూమిక పోషిస్తున్న నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ లు ఇద్దరు ఒకే అభ్యర్థి గెలుపు కోసం పని చేయటం అరుదైనదిగా చెప్పాలి. ఇద్దరు తండ్రుల మధ్య నడిచిన రాజకీయ పోరు.. వారి కారణంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్ని మర్చిపోలేం.

గతాన్ని పరిగణలోకి తీసుకుంటే.. నాదెండ్ల మనోహర్ తో పని చేయటానికి పురంధేశ్వరి ససేమిరా అనాలి. కానీ.. అందుకు భిన్నంగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ గెలుపు కోసం మండే ఎండల్లో చెమటలు చిందిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడిచి.. నాదెండ్లభాస్కర్ రావు (నాదెండ్ల మనోహర్ తండ్రి) కేంద్రంలోని ఇందిరమ్మ సాయంతో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటం తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన నాదెండ్ల.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాన్ని తెలుగు ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయి.. పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చేపట్టారు. ఊహించని ప్రజాస్పందన కారణంగా నెల తిరిగేసరికి నాదెండ్ల ప్రభుత్వం కూలిపోగా.. ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి ఇద్దరు నేతల సంతానం ఇప్పుడు ఒకే అభ్యర్థి గెలుపు కోసం పని చేయటం కాలవైచిత్రి కాక మరేమిటి?