Begin typing your search above and press return to search.

బీయారెస్ తో ఆ రెండు పార్టీలకు గండి....?

By:  Tupaki Desk   |   6 Jan 2023 5:37 PM GMT
బీయారెస్ తో ఆ రెండు పార్టీలకు గండి....?
X
ఏపీలో బీయారెస్ మీద ఇపుడు రాజకీయ చర్చ సాగుతోంది. బీయారెస్ ని లైట్ గా తీసుకోవాలా లేక సీరియస్ గానా అన్న విషయంలో ఇంకా ఒక స్పష్టత అయితే రావడంలేదు కానీ బీయారెస్ ఎంట్రీతో ఎంతో కొంత విపక్షానికి నష్టం అన్న భావనలో మాత్రం ఆ పార్టీల నేతలు ఉన్నారు. దానికి కారణం బీయారెస్ అనుసరిస్తున్న విధానాలే అంటున్నారు.

ఏపీలో బీయారెస్ ప్రెసిడెంట్ గా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ని కేసీయార్ ఏరి కోరి ఎంపిక చేశారు. అంతే కాదు గోదావరి కోస్తా ఉత్తరాంధ్రాల మీదనే కేసీయార్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దాంతో విపక్షాలకు పట్టున్న చోటనే బీయారెస్ కూడా పాగా వేయాలని చూస్తోందన్న అనుమానాలతో ఆ వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి.

బీయారెస్ మీద జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. బీయారెస్ రాజకీయాల మీద ఆయన మండిపడ్డారు. ఇపుడు కాపు సంక్షేమ సేన నాయకుడు, ఇటీవలే కాపులకు రిజవేషన్లు కోరుతూ నిరాహార దీక్ష చేసిన మాజీ మంత్రి కురు వృద్ధుడు చేగొండి హరి రామజోగయ్య బీయారెస్ మీద ఒక్క లెక్కన ఫైర్ అవుతున్నారు.

ఆయన ఏకంగా జగన్ కేసీయార్లను కలుపుతూ విమర్శలు చేశారు. కేసీయార్ గత ఎన్నికల్లో జగన్ కి ఏడు వందల కోట్ల రూపాయల మేర ఆర్ధిక సాయం చేసి ఎన్నికల్లో గెలిపించారని, ఈసారి ఆ రుణం తీర్చుకోవడానికే జగన్ ఆయన పార్టీని ఏపీలోకి ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఏపీలో విపక్క్ష ఓట్లు చీల్చడమే బీయారెస్ రాజకీయ వ్యూహం అని ఆయన అంటున్నారు. బీయారెస్ వల్ల కాపుల ఓట్లలో చీలిక తేవాలని ఆలోచిస్తున్నారని కూడా జోగయ్య అంటున్నారు.

ముఖ్యంగా జనసేన టీడీపీ ఓట్లకే బీయారెస్ గండి పెట్టాలని ఎత్తులు వేస్తోందని, దాన్ని పారనీయకుండా జాగ్రత్తపడాలని ఆయన హెచ్చరించారు. బీయారెస్ జాతీయ పార్టీ ముసుగులో ఏపీలో ఎంట్రీ ఇస్తోందని ఆయన అంటున్నారు. ఇదంతా కేసీయార్ జగన్ ల మధ్య ఒప్పందంలో భాగమే అని ఆయన చెప్పడం విశేషం.

నిజానికి ఏపీలో ఇపుడు ఉన్న అన్ని పార్టీలు దాదాపుగా జగన్ కి వ్యతిరేకమే. అదే సమయంలో ఆ పార్టీల మధ్య ఒక అవగాహన కూడా ఉందని అంటారు. ఇలా జగన్ వర్సెస్ విపక్షాలు అన్నట్లుగా ఏపీ పాలిటిక్స్ చీలితే కచ్చితంగా విపక్షాలకు లాభం ఉంటుంది. అలా కాకుండా విపక్షాలలో చీలిక వస్తే కనుక అది వైసీపీకి లాభిస్తుంది. అందువల్లనే బీజేపీని టీడీపీతో కలవనీయకుండా ఎత్తులు వేస్తున్నారు అని అంటున్నారు.

ఇపుడు బీయారెస్ కూడా ఏపీలో పోటీ చేస్తే నియోజకవర్గానికి వేయి నుంచి రెండు వేల ఓట్ల వంతున ఆ పార్టీ చీల్చినా కూడా హోరా హోరీ పోటీలో అది వైసీపీకి భారీ రాజకీయ లాభాన్నే తెస్తుంది అని అంటున్నారు. పైగా బీయారెస్ మొత్తం 175 సీట్లకూ పోటీ చేస్తామని అంటోంది. జగన్ పార్టీ పులి అనుకుంటే పుట్రలా బీయారెస్ రంగంలోకి దిగడంతో ఈ చీల్చుడు గోలేంటి రా బాబూ అనుకునే సీన్ ఉందిపుడు. జోగయ్య మాటలు కూడా అందులో భాగమే అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.