Begin typing your search above and press return to search.

బాబు ఇంకో మోసం బ‌య‌ట‌ప‌డింది

By:  Tupaki Desk   |   27 Nov 2016 12:38 PM IST
బాబు ఇంకో మోసం బ‌య‌ట‌ప‌డింది
X
మాజీ స్పీకర్‌ - పీసీసీ ఉపాధ్యక్షులు నాదెండ్ల మనోహర్ మ‌రోమారు ఏపీ స‌ర్కారును మ‌రోమారు త‌న‌దైన శైలిలో ఇర‌కాటంలో ప‌డేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు తమకు కావాల్సిన వారికే ప్రభుత్వ కొలువులు కల్పిస్తున్నాయని మ‌నోహ‌ర్‌ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించినట్లు అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కానీ సమాచార హక్కు చట్టం ద్వారా దానికి విరుద్ధమైన వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. స‌మాచార హ‌క్కు ద్వారా ఏపీ సీఎం చంద్ర‌బాబు చేస్తున్న మోసం బ‌య‌ట‌ప‌డింద‌ని మ‌నోహ‌ర్ అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా - ఎలాంటి పేపర్‌ ప్రకటన - ఇంటర్వూ లేకుండా కన్సల్టెన్సీ పేరిట కావాల్సిన వారికి పదవులను కట్టబెడుతున్నారని ఈ విష‌యాల‌న్నీ స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా తేలింద‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ వివ‌రించారు. ఒక‌వైపు ఉద్యోగాల క‌ల్ప‌న‌లో మోసం చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోవైపు త‌న‌కు కావాల్సిన వారికి పెద్ద ఎత్తున మేలు చేస్తుంద‌ని పేర్కొన్నారు. ప‌రిశ్రమల శాఖలో ఓ ప్రైవేటు వ్యక్తికి కన్సల్టెన్సీ పేరుతో అత్యున్నతమైన పదవిని కట్టబెట్టడమే కాకుండా, నెలవారీ జీత భత్యాలతో పాటు, బిజినెస్‌ రూల్స్‌కి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వామిని చేస్తున్నారన్నారు. సీఆర్‌ డిఎ - ఏపిఎండిసి - విద్యాశాఖ - మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాల్లో కన్సల్టెన్సీ సంస్థల ద్వారా నియామకాలు సాగుతున్నందున యువత ఉపాధికి దూరమవుతున్నారని మ‌నోహ‌న్ తెలిపారు. త‌న వాళ్ల‌కు ఇప్పించుకుంటున్న కొలువుల‌ను సైతం రాష్ట్ర యువ‌త‌కు క‌ల్పిస్తున్న‌ట్లుగా సీఎం చంద్ర‌బాబు ప్రచారం చేసుకుంటున్నార‌ని త‌ప్పుప‌ట్టారు.

మ‌రోవైపు పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరుపై నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి పద్మారావు మండిప‌డ్డారు. రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేయమని సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి సంస్కరణలను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు పర్యావసానంగా ప్రజలు పడుతున్నపాట్లను చంద్ర‌బాబు ఎందుకు ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్నార‌ని సూటిగా నిల‌దీశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ఒక ఆర్థిక ఉపద్రవంగా భావించి ప్రతి ఇంటికి వంద కేజీల బియ్యం ఇచ్చి ఆదుకోవచ్చు కదా! అని సూచించారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ - ఫోన్‌ బ్యాంకింగ్‌ నిరక్షరాస్యులు అర్థం చేసుకోవాలంటే 50 ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్న అంశాన్ని గుర్తు చేశారు. కానీ ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం సెల్ ఫోన్ ఇవ్వ‌గానే డిజిటల్ విప్ల‌వం వ‌చ్చిన‌ట్లు విశ్లేషిస్తున్నార‌ని క‌త్తి ప‌ద్మారావు ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/