Begin typing your search above and press return to search.

ప్రముఖుల చేరిక.. జనసేన ప్లానేంటి.?

By:  Tupaki Desk   |   12 Oct 2018 7:52 AM GMT
ప్రముఖుల చేరిక.. జనసేన ప్లానేంటి.?
X
కాంగ్రెస్ నాయకుడు, మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏపీలో ఉన్న అధికార, ప్రతిపక్షాలను వదిలేసి జనసేన పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకూ జనసేనలో చేరిన వారందరూ ఎక్కువమంది మధ్యస్థాయి నేతలే. కానీ మనోహర్ లాంటి ప్రముఖ నాయకుడు జనసేనలో చేరడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది.

జనసేనలో మనోహర్ చేరికపై పలు చానెళ్లలో ఎన్నో చర్చలు జరిగాయి. పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవడంతోనే మనోహర్ కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరాడని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి బరిలో నిలిస్తే మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిని సిట్టింగ్ స్థానం అయిన టీడీపీకే దక్కే అవకాశం ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారినట్టు కొంత మంది వాదించారు. ఇక తెనాలి వైసీపీ లో పోటీ తీవ్రంగా ఉండడంతోనే ఆయన జనసేనవైపు అడుగులేసినట్లు సమాచారం.

కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీ పీసీసీ పదవుల పందేరం తర్వాత మనోహర్ అసంతృప్తిగా ఉన్నారట.. తనకు ఏ పదవి ఇవ్వకపోవడంతో ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉంటున్నాడట.. మనోహర్ జనసేన పార్టీలోనే చేరుతాడని గడిచిన రెండేళ్లుగా సోషల్ మీడియాలో జనసేన అభిమానులు ప్రచారం చేస్తున్నారు. అనుకున్నట్టే ఆయన చేరడంతో జనసేన పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన అధికార ప్రతినిధి విజయ్ బాబు మాట్లాడుతూ.. మనోహర్ జనసేనలో చేరడంతో అంతా ఆశ్చర్యపోయారని.. రాబోయే రోజుల్లో మరిన్ని ఆశ్చర్యపరిచేలా చేరికలు ఉంటాయని ఆయన హింట్ ఇచ్చారు. వారు ఎంత స్థాయి నేతలో తెలిస్తే ఆశ్చర్యపోతారని ట్విస్ట్ ఇచ్చారు.

పార్టీలోకి వస్తున్న ప్రముఖ నాయకులతో జనసేన బలపడుతోందని.. తమకు మద్దతునిచ్చే కమ్యూనిటీలు, ప్రజలతో కలిసి రాబోయే ఎన్నికల్లో సత్తాచాటుతామని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది. నియోజకవర్గాల వారీగా ముఖ్యమైన నేతలను చేర్చుకొని రాబోయే ఎన్నికల ఫలితాలను మార్చడానికి ప్లాన్లు వేస్తున్నట్టు సమాచారం.