Begin typing your search above and press return to search.

వారిద్ద‌రికి నాదెండ్ల చెక్ పెట్టారా?

By:  Tupaki Desk   |   28 Nov 2018 8:02 AM GMT
వారిద్ద‌రికి నాదెండ్ల చెక్ పెట్టారా?
X
మాదాసు గంగాధ‌రం - తోట చంద్ర‌శేఖ‌ర్‌.. జ‌న‌సేనలో కీల‌క నేత‌లు. ఇన్నాళ్లూ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెన్నంటే క‌నిపించారు. ఆయ‌న ఎక్క‌డికెళ్తే అక్క‌డికి వెళ్లేవారు. ప‌వ‌న్ ప్ర‌సంగాల్లోనూ వీరి ప్ర‌భావం క‌నిపించేది. అయితే - క్ర‌మంగా ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు జ‌న‌సేన‌లో ప్రాధాన్య‌త త‌గ్గుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే వారు ప‌వ‌న్ వెంట క‌నిపిస్తున్నారు.

జ‌న‌సేన‌లో ఈ మార్పుకు కార‌ణ‌మేంట‌నే విష‌యంపై ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. వాటిలో ప్ర‌ధానంగా వినిపిస్తున్న కార‌ణం.. నాదెండ్ల మ‌నోహ‌ర్‌. ఆయ‌న రాక త‌ర్వాత ప‌వ‌న్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపించిన‌ట్లు తెలుస్తోంది. మాదాసు గంగాధ‌రం - తోట చంద్ర‌శేఖ‌ర్‌ లు పార్టీకి అంటీ అంట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టానికి కూడా ఆయ‌నే కార‌ణ‌మ‌ని స‌మాచారం అందుతోంది.

వాస్త‌వానికి మాదాసు - తోట ఇద్ద‌రూ ప‌వ‌న్‌ కు వీరాభిమానులు. మాదాసు చిరంజీవి స్థాపించిన‌ ప్ర‌జారాజ్యం పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప‌వ‌న్ కోట‌రీలోనూ ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ల‌భించింది. అయితే - ప‌వ‌న్‌ కు తెలియ‌కుండానే జ‌న‌సేన టికెట్ల పంప‌కాలు ప్రారంభించార‌ని ఆయ‌న‌పై ఇటీవ‌ల ఆరోప‌ణ‌లొచ్చాయి. ఇక ప‌వ‌న్ కోసం ఏకంగా ఓ టీవీ ఛానెల్‌ నే కొనేయ‌డం ద్వారా ప‌వ‌న్‌పై త‌న అభిమానాన్ని చాటుకున్నారు మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర‌శేఖ‌ర్‌. కానీ - ప‌వ‌న్‌కు చెప్ప‌కుండానే వైసీపీతో పొత్తు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ఈయ‌న‌పై అరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ఈ నేప‌థ్యంలోనే వారిద్ద‌రిని ప‌వ‌న్ ప‌క్క‌కు పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే - త‌మ త‌ర్వాత మొన్న‌మొన్న‌నే పార్టీలో అడుగుపెట్టిన‌ నాదెండ్ల‌కు త‌మ కంటే ప‌వ‌న్ ఎక్కువ ప్రాధాన్య‌మిస్తుండ‌టం చూసి మాదాసు - తోట‌ నొచ్చుకున్నార‌ని.. అందుకే వారే పార్టీకి దూరంగా ఉంటున్నార‌ని కూడా కొన్ని వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీలో త‌న‌దైన ముద్ర వేసేందుకే నాదెండ్ల జోక్యం చేసుకొని పాత కోట‌రీకి చెక్ పెట్టార‌నీ ప‌లువురు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆది నుంచి జ‌న‌సేన‌కు అండ‌గా నిలుస్తున్న‌ మాదాసు - తోట దూర‌మైతే అది పార్టీకి గ‌ట్టి దెబ్బేన‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.