Begin typing your search above and press return to search.

వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పిన నయిం భార్య

By:  Tupaki Desk   |   28 Nov 2019 5:33 AM GMT
వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పిన నయిం భార్య
X
ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత కొందరు పోలీసులు.. రాజకీయ నేతల బలంతో చెలరేగిపోయిన గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్లో హతం కావటం తెలిసిందే. అతను మరణించిన తర్వాత అతనికున్న ఆస్తుల లెక్కల్లోకి వెళ్లిన అధికారులకు తరచూ షాకుల మీద షాకులు తగిలిన పరిస్థితి. అంచనాకు ఏ మాత్రం సంబంధం లేకుండా వెలుగు చూసిన వందల కోట్ల ఆస్తుల్ని చూసి అవాక్కుఅయ్యారు.

తన పేరుతో పాటు భార్య, పిల్లలు.. బావమరిది.. బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసు అధికారులు తమ విచారణలో గుర్తించారు. వందలాది కోట్ల ఆస్తుల్ని ఎలా సంపాదించారన్న విషయాన్ని నయిం భార్యను ప్రశ్నించారు ఐటీ శాఖ అధికారులు. ఈ సందర్భంగా అధికారులు షాక్ తినేలా నయిం సతీమణి సమాధానం ఇచ్చిందట.

వందలాది కోట్ల ఆదాయాన్ని తాను టైలరింగ్ చేసి సంపాదించినట్లు నయిం భార్య హసీనా అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఎలా రియాక్ట్ కావాలో అధికారులకు అర్థం కాలేదట. వందల కోట్ల ఆదాయాన్ని సంపాదించిన ఆమె ఎప్పుడైనా ఆదాయపన్ను కట్టారా? అని అడగటంతో పాటు.. ఆమె ఆస్తులకు సంబంధించిన వివరాల్ని ఆమె ముందు పెట్టారట. దీంతో ఆమె మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల ఎన్ కౌంటర్లో హతమైన నయిం ఆస్తుల విలువ దాదాపు రూ.2వేల కోట్ల వరకూ ఉంటాయని గతంలో సిట్ తేల్చింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములతో పాటు.. 29 భవనాలు.. రెండు కిలోల బంగారం.. రూ.2కోట్ల క్యాష్ ఉన్నట్లు సిట్ గుర్తించింది. టైలరింగ్ తో వందల కోట్లు ఎలా సంపాదించొచ్చన్న విషయం నయిం భార్య అందరికి చెబితే బాగుంటుందేమో?