Begin typing your search above and press return to search.

చిరంజీవి త‌ప్ప అంద‌రూ మ‌హా న‌టులే: నాగ‌బాబు కామెంట్స్ వైర‌ల్

By:  Tupaki Desk   |   7 July 2022 4:08 AM GMT
చిరంజీవి త‌ప్ప అంద‌రూ మ‌హా న‌టులే: నాగ‌బాబు కామెంట్స్ వైర‌ల్
X
కొద్ది రోజుల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని భీమ‌వ‌రంలో విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్, ఏపీ మంత్రులు ఆర్కే రోజా, దాడిశెట్టి రాజా, మెగాస్టార్ చిరంజీవి, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పురందేశ్వ‌రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు త‌దిత‌రులు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. టీడీపీకి కూడా ఆహ్వానం అందినా అచ్చెన్నాయుడును జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడ్డుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే అనూహ్యంగా బీజేపీతో పొత్తుతో న‌డుస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు హాజ‌రుకాక‌పోవ‌డం అంద‌రిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న‌కు అస‌లు ఆహ్వానం అందలేద‌ని, ఆహ్వానం అందినా అవినీతి ప‌రుడైన సీఎం వైఎస్ జ‌గ‌న్ తో వేదిక పంచుకోవ‌డం ఇష్టం లేక ప‌వ‌న్ క‌ల్యాణ్ రాలేద‌ని ఇలా ఎవ‌రికి తోచిన భాష్యం వారు చేశారు. ఆ స‌భ‌లో చిరంజీవితో ప్ర‌ధాని మోడీ ముచ్చ‌ట్లు ఓవైపు, సీఎం జ‌గ‌న్ చిరుతో ఆత్మీయ ఆలింగినం మ‌రోవైపు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారాయి. అటు బీజేపీ, ఇటు వైఎస్సార్సీపీ చిరంజీవికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ద్వారా ఏపీలో అతిపెద్ద సామాజిక‌వ‌ర్గం కాపుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో మెగా బ్ర‌ద‌ర్, జ‌నసేన పార్టీ ముఖ్య నేత నాగ‌బాబు సంచ‌ల‌న ట్వీట్లు కాక రేపాయి. మ‌న్యం వీరుడు అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ భీమ‌వరంలో అద్బుతంగా జ‌రిగింది.. ఆ మ‌హానుభావుడికి నా నివాళి అంటూ ట్వీట్ చేసిన నాగ‌బాబు మ‌రో సంచ‌లన ట్వీట్ కూడా చేశారు.

భీమ‌వ‌రంలో స‌భ‌లో అన్న‌య్య చిరంజీవి త‌ప్ప అంద‌రూ అద్భుతంగా పెర‌ఫార్మెన్సు చేశారంటూ నాగ‌బాబు కాక రేపే ట్వీట్ చేశారు. అంత‌టితో ఆగ‌ని నాగ‌బాబు.. ఆ మ‌హానటులంద‌రికీ వంద‌నాలు అంటూ ఆ ట్వీటులో పేర్కొన్నారు. ఇప్పుడు నాగ‌బాబు చిరంజీవి త‌ప్ప ఆ స‌భ‌లో పాల్గొన్న ప్ర‌ధాని మోడీ, జ‌గ‌న్, రోజా, దాడిశెట్టి రాజా, సోము వీర్రాజు, పురందేశ్వ‌రి ఇలా అంద‌రినీ మ‌హాన‌టుల‌ని అన్న‌ట్టా అనే చ‌ర్చ నెటిజ‌న్లలో జ‌రుగుతోంది.

భీమ‌వ‌రంతోపాటు ఉభ‌య గోదావరి జిల్లాల్లో అత్య‌ధికంగా ఉన్న కాపుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికే చిరంజీవిని పిలిచార‌ని, చిరంజీవికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, వైఎస్ జ‌గ‌న్ అధిక ప్రాధాన్యం ఇవ్వ‌డం ఇందులో భాగ‌మేన‌ని నాగ‌బాబు న‌మ్ముతున్న‌ట్టు నెటిజ‌న్ల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ కోణంలోనే నాగ‌బాబు త‌న అన్న చిరంజీవి త‌ప్ప అంద‌రూ మ‌హా న‌టులే అని ట్వీట్ చేశార‌ని చెబుతున్నారు.

కాపుల ఓట్ల‌ను గంప‌గుత్తగా కొల్ల‌గొట్టాల‌ని వేసిన బీజేపీ ప్లానును అర్థం చేసుకోవ‌డం వ‌ల్లే ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ‌వ‌రం స‌భ‌కు డుమ్మా కొట్టార‌ని త‌న ట్వీట్ ద్వారా నాగ‌బాబు చెప్పిన‌ట్టేన‌ని పేర్కొంటున్నారు. మ‌రోవైపు ఈ మోస‌పూరిత ఆప్యాయ‌త‌లు, కౌగిలింత‌ల‌కు ప‌డిపోవ‌ద్ద‌ని త‌న సోద‌రుడు చిరంజీవికి త‌న ట్వీట్ ద్వారా చెప్ప‌ద‌ల్చుకున్నారా అని నెటిజ‌న్లు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.