Begin typing your search above and press return to search.

చిరుకు వైసీపీ రాజ్యసభ సీటు.. నాగబాబు హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   5 March 2020 4:58 AM GMT
చిరుకు వైసీపీ రాజ్యసభ సీటు.. నాగబాబు హాట్ కామెంట్స్
X
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ప్రజారాజ్యం స్థాపించి కాంగ్రెస్ లో కలిపేసి రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తిని.. అవమానాలపాలై ఇక రాజకీయాల్లోకి రాకూడదని సినిమాల బాట పట్టారు. అయితే సైరా సినిమా వేళ మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సొంత అన్నయ్య ఇలా జగన్ తో సాన్నిహిత్యం మెయింటేన్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్ల లో ఒక సీటును సీఎం జగన్ తాజాగా చిరంజీవికి ఇస్తున్నారనే ప్రచారం మొదలైంది. చిరంజీవి సపోర్టు వైసీపీకా? జనసేనకు కాదా అన్న ఆందోళన జన సైనికుల్లో రాజుకుంది. ఈ నేపథ్యం లో దాదాపు రెండు నెలలుగా గ్యాప్ ఇచ్చిన నాగబాబు తాజాగా తన యూట్యూబ్ లో ఓ వీడియో పెట్టాడు. వీటన్నింటికి క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవి రాజకీయాలను పూర్తిగా వదిలేశాడని మెగా బ్రదర్ నాగబాబు స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో ఒక్కరే ఉండాలని.. ప్రజలపై అభిమానం, ప్రేమ బాగా ఉన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసమే చిరంజీవి రాజకీయాలను త్యాగం చేశాడని సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కోసం చిరంజీవి తన రాజకీయ భవిష్యత్ వదిలేశాడని తెలిపారు. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళుతున్నారన్నది తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. ఇది వైసీపీ అనుకూల వెబ్ సైట్లు చేస్తున్న తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు.

ఇక చిరంజీవి సపోర్టు వైసీపీకా.. జనసేనకా అన్న దానిపై కూడా నాగబాబు క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి రాజకీయాలను వదిలేశాడని.. ఆయన ఏ పార్టీకి సపోర్టు చేయాలనుకోవడం లేదని తెలిపారు. వైసీపీకి, జనసేనకు అంతే దూరంగా ఉంటున్నారని.. ఆయన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించ వద్దని వివరణ ఇచ్చారు. పవన్ కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలంటే తాను జనసేన లో ఉండకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నారని తెలిపారు.

రాజకీయాల్లో తన కంటే పవన్ అద్భుతంగా సేవ చేయగలడని చిరంజీవి నమ్ముతున్నారని నాగబాబు అన్నారు. చిరంజీవి ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారని.. ఆయన ఏ రాజకీయ పార్టీలోకి రారు.. పదవులు తీసుకోరని స్పష్టం చేశారు.

ఇక అమరావతి లొల్లి లో చిరంజీవి ఇంటి ఎదుట ధర్నా చేసే వాళ్లను నాగబాబు తప్పుపట్టారు. నిర్మాతలు చిరంజీవిపై కామెంట్ చేయడాన్ని నిలదీశారు. చిరంజీవికి వ్యక్తిగత అభిప్రాయం ఉండొద్దా అని నాగబాబు నిలదీశారు. తాము అమరావతి ఆందోళనకు జనసేన తరుపుణ మద్దతు పలికామని తెలిపారు.