Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్ 7ఓ క్లాక్ బ్లేడుపై నాగబాబు కామెంట్

By:  Tupaki Desk   |   31 Dec 2018 6:05 AM GMT
బండ్ల గణేష్ 7ఓ క్లాక్ బ్లేడుపై నాగబాబు కామెంట్
X
తెలంగాణ ఎన్నికల వేళ గొప్పలకు పోయి దెబ్బైపోయిన పొలిటీషియన్ కం నటుడు ఎవరైనా ఉన్నారంటే అది బండ్ల గణేషే.. కాంగ్రెస్ గెలువకపోతే 7ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానని సవాల్ విసిరి సంచలనం రేపారు. ఆయన సీరియస్ డైలాగులు జనానికి చాలా కామెడీని పంచాయి. అయితే ఆయన అంచనా తప్పైంది. కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో మీడియాకు ముఖం చూపించకుండా రెండు మూడు రోజులు అస్సలు బయటకు రాలేదు. చివరగా తిరుపతి వెంకన్నను దర్శించుకున్నాక మీడియా కంట పడ్డారు. బ్లేడుతో గొంతుకోసుంటానన్నారు అంటూ మీడియా ప్రశ్నించగా.. ‘ఎన్నికల వేళ వంద అంటామండి..’ అంటూ మాట మార్చేశారు. ఇప్పటికీ బండ్ల గణేష్ ఎక్కడ కనిపించినా ఆ 7ఓ క్లాక్ బ్లేడ్ గురించే అందరూ సెటైర్లు వేస్తుంటారు..

కాగా తాజాగా బండ్ల గణేష్ వ్యాఖ్యలపై నటుడు - నిర్మాత మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు.. ‘బండ్ల గణేష్ లో కామెడీ టైమింగ్ ఎక్కువ. అతడి ఫన్ జనరేట్ చేస్తే చూడాలనిపిస్తుంది. కానీ ఈ టాలెంట్ సినిమాల్లో పెట్టి ఉంటే చాలా పెద్ద కమెడియన్ అయ్యేవాడు.. దాన్ని సినిమాల్లో చూపించకుండా నిజజీవితంలో చూపించేసరికి నవ్వుల పాలవుతున్నాడు. ఏదీ ఏమైనా ఇప్పుడు బండ్ల గణేష్ ఇంటర్వ్యూ వస్తుందంటే చూడాలనిపిస్తోంది’ అంటూ నాగబాబు సుతిమెత్తగా సెటైర్ వేశారు.

బొత్స సత్యనారాయణ అనుచరుడిగా బండ్ల గణేష్ రాజకీయాలపై ఆశలు పెంచుకున్నాడని.. ఎంపీ - ఎమ్మెల్యే అవుదామని కాంగ్రెస్ పార్టీలో చేరాడని నాగబాబు చెప్పుకొచ్చారు. ‘‘బ్లేడు తెండి కోసుకుంటా.. ఓడిపోతే ఏం చేస్తాడు.. నిజంగా కోసుకుంటాడా అని అందరూ సందేహపడ్డారని.. కానీ తాను మాత్రం బండ్ల మాట మారుస్తాడని ముందే తెలుసు అంటూ నాగబాబు వివరించారు. ఏది ఏమైనా తెలంగాణ వాడి వేడి ప్రసంగాల్లో బండ్ల గణేష్ కామెడీ ఇంటర్వ్యూలు మాత్రం నవ్వులు పంచాయని నాగబాబు తెలిపారు. అలా నవ్వించినందుకు బండ్లను మెచ్చుకోవాలని అన్నారు.

బండ్ల గణేష్ మూడు నెలల కిందటే కాంగ్రెస్ లో చేరి దాని చరిత్ర చెప్పాడని.. అలా ఓవర్ నైట్ లీడర్ కావడం అంతా ఈజీకాదని ఇప్పటికైనా అతడికి తెలిసిందని నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం ,జనసేన పార్టీ తరుఫున ఎంతో కష్టపడుతున్నారని.. పార్టీ తరుఫున పనిచేసుకుంటూ పోతే ఐదేళ్లు, పదేళ్లకు రిజల్ట్ వస్తుందని తెలిపారు.

తెలంగాణలో టీఆర్ ఎస్ మంచి పనులు - పాలన చేసింది కాబట్టి తిరిగి అధికారంలోకి వచ్చిందని నాగబాబు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో సెటిలర్లను కూడా తెలంగాణ బిడ్డలుగా చూసుకుంటామని కేసీఆర్ ఇచ్చిన భరోసాను నమ్మారు. మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడం వల్లే మహాకూటమి ఓడిపోయింది. కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేలకపోవడం కూడా మైనస్ అయ్యింది అన్నింటికి మించి టీఆర్ఎస్ అభివృద్ధి పనులు ఆ పార్టీ గెలుపునకు, కాంగ్రెస్ ఓటమికి దారితీశాయని నాగబాబు వర్థమాన రాజకీయాలపై విశ్లేషించారు.