Begin typing your search above and press return to search.

జనసేనకు కొత్త డిప్యూటీ... మెగా జోష్...?

By:  Tupaki Desk   |   15 March 2022 4:15 AM GMT
జనసేనకు కొత్త డిప్యూటీ... మెగా జోష్...?
X
జనసేనకు పవన్ కళ్యాణ్ సర్వం సహా. ఆయన తరువాత ఎవరు అంటే వినిపించే రెండవ పేరు నాదెండ్ల మనోహర్. ఇప్పటిదాకా జనసేనకు అన్నీ తానై కధ నడిపిస్తున్నది నాదెండ్ల మనోహర్ మాత్రమే. ఆయన జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ కూడా. మరో వైపు పవన్ సినిమాల్లో బిజీగా ఉంటే పార్టీ పనులను చక్కబెడుతూ క్యాడర్ కి అందుబాటులో ఉంటూ వస్తున్నది కూడా ఆయనే.

ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. నాదెండ్లతో పాటుగా మరో కీలక నేతగా మెగా బ్రదర్ నాగబాబుని తీసుకువస్తున్నారు అని అంటున్నారు. 2019 ఎన్నికల ముందు పార్టీలో ఎంట్రీ ఇచ్చి నర్సాపురం లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి ఓడిన తరువాత నాగబాబు జనసేనలో పెద్దగా కనిపించినది లేదు.

అయితే మూడేళ్ల కాలం గడవడం, ఎన్నికలకు రెండేళ్ళు మాత్రమే సమయం ఉండడంతో నాగబాబు మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు అని అంటున్నారు. నాగబాబుని ఆ విధంగా పార్టీలో కీలకం చేసి ఇక మీదట మరిన్ని ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఇక జనసేన సభలో నాగబాబు కూడా ఫుల్ జోష్ తో మాట్లాడారు.

ఆయన జగన్ పాలనను దుర్మార్గ పాలనగా పేర్కొన్నారు. జగన్ కనుక మళ్లీ ఏపీలో అధికారంలోకి వస్తే ఇక ఏపీని అంతా వదిలి కాందిశీకులుగా ఇతర రాష్ట్రాలకు పోవాల్సిందే అంటూ పంచ్ డైలాగులే పేల్చారు. ఇక నాగబాబుని పవన్ తనకు రాజకీయాలలో అవగాహన కల్పించిన అన్న గారు అంటూ వేదిక మీద సభా ముఖంగా కొనియాడారు. ఒక విధంగా దీన్ని చూస్తూంటే నాగబాబుని యాక్టివ్ కమ్మని పవన్ స్వయంగా కోరారా అన్న చర్చ వస్తోంది.

ఇక వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు. గట్టిగా రెండేళ్ల వ్యవధి కూడా లేదు. దాంతో నాదెండ్ల ఒక్కరే మొత్తం పార్టీ బాధ్యతలను చూడడానికి సరిపోరు అన్న ఉద్దేశ్యంతోనే నాగబాబుని పార్టీలో కీలకం చేస్తున్నారు అన్న మాట వినిపిసొతోంది. అదే టైమ్ లో మెగాభిమానులతో నాగబాబుకు ఉన్న అనుబంధం వేరు.

ఆయనకు ఏపీవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో నాగబాబును ఆ విధంగా పార్టీలో ఫ్యాన్ బేస్ మరింత గట్టిగా ఉండేలా చేయడానికి ఉపయోగించుకుంటారు అని తెలుస్తోంది. అదే విధంగా ఇక మీదట జిల్లా టూర్లు కూడా నాగబాబు చేసెలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని అంటున్నారు.

పార్టీ క్షేత్ర స్థాయిలో ఎలా ఉంది. ఎక్కడ లోపాలు ఉన్నాయి. గట్టి నాయకులు ఎవరు, పనిచేసే వారు ఎవరు ఇలాంటి వివరాలు కూడా నాగబాబు జిల్లాల టూర్లకు వెళ్ళి స్వయంగా తెలుసుకుని అధినాయకత్వానికి తెలియచేస్తారని చెబుతున్నారు. మొత్తానికి రానున్న రెండేళ్ల కాలం నాగబాబు జనసేనలో పొలిటికల్ గా ఫుల్ బిజీ కానున్నారు అనే అంటున్నారు.

మరో వైపు నాదెండ్ల మనోనర్ జనసేన పొత్తులు, ఇతర పర్టీలతో రిలేషన్స్, పాలసీస్ వంటి వాటి మీద పని చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కి కుడి ఎడమలుగా కూర్చున్న నాదెండ్ల, నాగ‌బాబు ఆ పార్టీలు రెండు చేతులుగా పనిచేయాలన్నదే పవన్ ఆలోచన అని చెబుతున్నారు. మొత్తానికి నాగబాబు జనసేనలో తిరిగి యాక్టివ్ కావడంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు.