Begin typing your search above and press return to search.

యజ్ఞశాల పార్కింగ్ ప్లేసయింది...

By:  Tupaki Desk   |   17 July 2015 10:55 AM GMT
యజ్ఞశాల పార్కింగ్ ప్లేసయింది...
X
తెలంగాణలో పుష్కరాల నిర్వహణలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది... మహారాష్ట్ర నుంచి గోదావరికి నీరు విడుదల చేయించుకోలేకపోవడంతో మొదలైన ఈ వైఫల్యం ఇతర ఏర్పాట్లలోనూ కనిపిస్తోంది. బాసర మొదలుకొని కందకుర్తి, ధర్మపురి, కాళేశ్వరం మీదుగా భద్రాచలం వరకు భక్తులకు ఒకటే అవస్థలు. అంతేకాదు... నిధులూ గోదారి బురదలో పోసిన పన్నీరే అయ్యాయి. భద్రాచలంలో నాగా సాధువులతో భారీ యఙం చేయిస్తామని ఆలోచన చేసినా వారి రాకకోసం ప్రయత్నాలు చేయకపోవడంతో కోటీ ముప్ఫయి లక్షలు వృథా అయ్యాయి.

గోదావరి పుష్కరాల్లో మునుపెన్నడూ లేనట్లుగా విశ్వశాంతి మహాయజ్ఞం చేస్తున్నామంటూ.. నాగా సాధువులు, అఘోరాలు వచ్చి పూజలు చేస్తారంటూ బూర్గంపాడు మండలం సారపాక సమీపంలో మహాయఙానికి ఏర్పాట్లు చేశారు. అయితే... ఒక్కరంటే ఒక్కరు కూడా నాగా సాధువులు రాలేదు... అఘోరాల జాడే లేదు. దీంతో ఆ 1.30 కోట్లు వృథా అయ్యాయి.

పాల్వంచకు చెందిన ఒక ట్రస్టు ఈ మహాయజ్ఞాన్ని ప్రతిపాదించడంతో దేవాదాయ శాఖ 1.30 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దాంతో యాగశాలలు, ఇతరత్రా ఏర్పాట్లు చేశారు. కానీ.... నాగాసాధువులు, అఘోరాలు రాకపోవడంతో యజ్ఞశాలలు ఇప్పుడు బోసిపోతున్నాయి. పుష్కర భక్తులు అటువైపు చూడడమే లేదు. పైగా ఈ యజ్ఞశాలలు పార్కింగు ప్లేసుల వద్ద ఉండడంతో ప్రస్తుతం భక్తులు రద్దీ పెరిగి పార్కింగు ప్లేస్ చాలనప్పుడంతా ఇవి కూడా పార్కింగు ప్లేసులుగా మారిపోతున్నాయి.