Begin typing your search above and press return to search.

నాగ‌బాబు మార్క్ స‌టైర్లు... బీజేపీ వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   7 July 2022 9:30 AM GMT
నాగ‌బాబు మార్క్ స‌టైర్లు... బీజేపీ వార్నింగ్‌!
X
ఏపీ ప్ర‌భుత్వం, కేంద్రంలోని న‌రేంద్ర మోడీపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌దైన శైలిలో స‌టైర్లు గుప్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని మోడీ పాల్గొన్న సభపై జనసేన ముఖ్య నేత, సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు వ్యంగ్యాస్త్రం సంధించారు. ''ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు, ఆ మహానటులందరికీ ఇదే నా అభినందనలు'' అని నాగబాబు ట్వీట్ చేశారు.

వైసీపీ మంత్రి రోజా, ముఖ్యమంత్రి జగన్‌ను పరోక్షంగా ఎద్దేవా చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు పరోక్షంగా బీజేపీ నేతలను కూడా మహా నటులని నాగబాబు అనేశారని అభిప్రాయపడ్డారు. అంత ఇబ్బందిగా ఉంటే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలి గానీ, ఇలా అవమానించే విధంగా ట్వీట్స్ పెడితే సహించేది లేదని నాగబాబును కొందరు బీజేపీ అభిమానులు ట్విట్టర్‌లో హెచ్చరించారు.

చిరంజీవిని 'సోదరుడు' అని జగన్ సంభోదించడంపై జనసేన కార్యకర్తలు కారాలుమిరియాలు నూరుతున్నారు. 'అదంతా నటన' అనే అర్థం వచ్చేలా నాగబాబు ఇప్పుడు పరోక్షంగా ఈ ట్వీట్ చేశారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ విగ్రహావిష్కరణకు వెళ్లలేదు. అసలు ఆయనకు లిఖితపూర్వక ఆహ్వానమే అందలేదు. దీనిపై విమర్శలు రావడంతో ఒక రోజు ముందు కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసి రమ్మని పిలిచారు.

అయితే తాను రాలేనని పవన్‌ స్పష్టం చేశారు. జగన్‌ ఒత్తిడితోనే ఆయన్ను కూడా ఆహ్వానితుల జాబితాలో చేర్చలేదని అంటున్నారు. విచిత్రంగా.. పవన్‌ సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవికి మాత్రం లిఖితపూర్వకంగా అధికారిక ఆహ్వానం అందింది. ఫోన్లో కూడా పిలిచారు. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రిగా పిలిచామని కిషన్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు బీజేపీలోనే ఉన్నారు. ఆయనకూ ఆహ్వానం అందలేదు. అల్లూరి సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుకూ పిలుపు లేదు. ఇలా అల్లూరి విగ్రహావిష్కరణ సభ జరిగిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే.. మెగా బ్రదర్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి వేదిక పంచుకోవడం జనసేన కార్యకర్తలకు రుచించడం లేదు.

పవన్, నాగబాబు ఈ గట్టున ఉంటే.. చిరు మాత్రం ఆ గట్టున ఉండటం జనసేనకు తలనొప్పిగా మారింది. అయితే.. భీమవరం సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు చిరంజీవి వెళ్లారని, వైసీపీ పిలిస్తే వెళ్లలేదని.. అందువల్ల చిరు హాజరవ్వడాన్ని రాజకీయ కోణంలో చూడక్కర్లేదని చిరంజీవి అభిమానులు చెబుతున్నారు.