Begin typing your search above and press return to search.

విశాఖ జనసేన ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు...?

By:  Tupaki Desk   |   12 Jan 2023 3:27 AM GMT
విశాఖ జనసేన ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు...?
X
ఏపీలో పొత్తుల నుంచి కధ కాస్తా ముందుకు జరిగి అభ్యర్ధుల ఖరారు దాకా వస్తోంది. సీట్లు ఎన్ని ఇస్తారు అన్నది మెల్లగా మబ్బులు వీడుతూ కీలక స్థానాలలో పోటీ చేసే వారి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయింది అని అంటున్నారు. ఇక ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు అంటే పాతిక నుంచి ముప్పయి అని అంటున్నారు.

అలాగే అయిదు దాకా ఎంపీ సీట్లు దక్కవచ్చు అని చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే జనసేనకు ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది అని అంటున్నారు. ఇక విశాఖ ఏపీలో ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటు. ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

అలాంటి సీటు మీద జనసేన కన్ను పడింది. అంతే చంద్రబాబు కూడా ఓకే చేసేశారు అని అంటున్నారు. నిజానికి నర్సాపురం సీటుని కూడా జనసేన కోరుకున్నా అక్కడ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజుకు బాబు మాట ఇచ్చి ఉన్నందువల్ల ఆయనకు తెలుగుదేశం తరఫున మరోసారి ఎంపీగా పోటీ చేయిస్తారు అని తెలుస్తోంది. దాంతో గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసిన మెగా బ్రదర్ నాగబాబుని విశాఖ ఎంపీ సీటుకు షిఫ్ట్ చేస్తారు అని చెబుతున్నారు.

ఇక విశాఖలో 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే రెండు లక్షల 84 వేల దాకా ఓట్లు వచ్చాయి. దాంతో పాటు విశాఖ సిటీలో చాలా అసెంబ్లీ సీట్లు జనసేన కోరుకుంటోంది. అదే విధంగా జనసేనకు విశాఖ సిటీలో పట్టుంది. ఇవన్నీ కలసి జనసేన నుంచి నాగబాబు వంటి టవరింగ్ పర్సనాలిటీ పోటీకి దిగితే కచ్చితంగా గెలుస్తారు అని అంటున్నారు.

అదే టైం లో తెలుగుదేశానికి విశాఖ ఎంపీ సీటు రెండు దశాబ్దాలుగా అందని పండుగా మారింది. చివరి సారిగా 1999లోనే తెలుగుదేశం గెలిచింది. 2004, 2009లలో కాంగ్రెస్ నుంచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి గెలిచారు. 2014లో తెలుగుదేశం మద్దతుతో బీజేపీ అభ్యర్ధి హరిబాబు గెలిచారు. 2019లో వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. దాంతో ఈ సీటు విషయంలో తెలుగుదేశం వదిలేసుకోవడమే బెటర్ అని డిసైడ్ అయిందట.

అదే విధంగా నర్సాపురంలో తెలుగుదేశానికి మంచి బలం ఉంది. అలాగే చూసుకుంటే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామను తమ పార్టీ నుంచి పోటీకి దించితే జగన్ సర్కార్ మీద ఆయన మరింత పదునుగా విమర్శలు చేసి తమకు లబ్ది చేకూరుస్తారు అని ఆలోచిస్తున్నారుట. దాంతో బాబు మార్క్ స్కెచ్ లో అటు జనసేనకు ఇటు తెలుగుదేశానికి లాభం కలుగుతుంది అని అంటున్నారు. ఇవన్నీ చూస్తే విశాఖ నుంచి మెగా బ్రదర్ పోటీకి దిగడం ఖాయమే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.