Begin typing your search above and press return to search.

అత‌డు ఎండు గ‌డ్డి, చెత్తా చెదారం తింటున్నాడు: నాగ‌బాబు నిప్పులు!

By:  Tupaki Desk   |   20 July 2022 4:24 AM GMT
అత‌డు ఎండు గ‌డ్డి, చెత్తా చెదారం తింటున్నాడు: నాగ‌బాబు నిప్పులు!
X
సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌పై మెగా బ్ర‌ద‌ర్, జ‌న‌సేన ముఖ్య నేత నాగ‌బాబు నిప్పులు చెరిగారు. ఈ నారాయ‌ణ చాలా కాలం నుంచి అన్నం తిన‌డం మానేసి ఎండు గ‌డ్డి, చెత్తా చెదారం తింటున్నాడని ధ్వ‌జమెత్తారు. కాబ‌ట్టి నారాయ‌ణ‌తో గ‌డ్డి తిన‌డం మానిపించి.. కాస్త అన్నం పెట్టండ‌ని మెగాభిమానుల‌ను నాగ‌బాబు కోరారు. ఇలా చేస్తే తెలివి తెచ్చుకుని నారాయ‌ణ మ‌నిషిలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని సెటైర్లు వేశారు.

రెండు రోజుల క్రితం తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ గురించి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ప్ర‌ముఖ సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవిని ల‌క్ష్యంగా చేసుకుని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. చిరంజీవి చిల్ల‌ర బేర‌గాడు అని, బ్రోక‌ర్ అని, ర‌క‌ర‌కాల రంగులు మార్చే ఊస‌ర‌వెల్లి అంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పైన నారాయ‌ణ వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ ల్యాండ్ మైన్ లాంటివాడ‌ని.. అది ఎప్పుడు పేలుతుందో ఎవ‌రికీ తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ వ్య‌తిరేక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ల‌సి రావాల‌ని కోరారు.

చిరంజీవి, ప‌వ‌న్ ల‌పై నారాయ‌ణ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు మెగాభిమానుల‌కు ఆగ్ర‌హం తెప్పించాయి. నారాయ‌ణవి చిల్ల‌ర మాట‌లు అని మెగాభిమానులు తీవ్రంగా ఖండించారు. నారాయ‌ణ మొద‌టి నుంచి క‌మ్యూనిస్టు కాద‌ని క‌మ్మ‌నిస్టు అని.. ఈ కోణంలోనే ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని సోష‌ల్ మీడియాలో మండిప‌డుతున్నారు. చిరంజీవిపై చేసిన వ్యాఖ్య‌ల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని హెచ్చ‌రించారు. లేక‌పోతే జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు నారాయ‌ణే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలోనే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్, ఫేస్ బుక్ ల్లో నారాయ‌ణ‌పై నిప్పులు చెరిగారు. ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు.

కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి.! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు. అని నాగ‌బాబు తన పోస్టుల్లో ఆగ్రహం వ్య‌క్తం చేశారు.