Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రిగా పవన్... నాగబాబు చెప్పిన నిజం

By:  Tupaki Desk   |   18 Dec 2022 6:30 AM GMT
కేంద్ర  మంత్రిగా పవన్... నాగబాబు చెప్పిన నిజం
X
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో ఆయన తన పార్టీని సొంతంగా పోటీ చేయించి తాను రెండు సీట్లలో పోటీ చేశారు. అయితే జనసేనకు ఒకే ఒక్క సీటు దక్కింది. పవన్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఈ టైంలో నాగబాబు సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు.

ది రియల్ యోగి అంటూ గణ అన్న రచయిత రాసిన పుస్తకాన్ని ప్రసాద్ లాబ్స్ లో ఆవిష్కరించిన కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చాలా సేపు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఆకాశాన్ని ఎత్తేస్తూ ఎన్నో విషయాలు చెప్పారు. తన తమ్ముడు అని తగ్గుతున్నాను ఎక్కువ చెప్పుకోకూడదు అని ఆలోచిస్తున్నాను అని అంటూనే చెప్పాల్సినవి అన్నీ చెప్పేసారు.

ఈ సందర్భంగా నాగబాబు చెప్పింది ఏంటీ అంటే పవన్ పదవుల కోసం పార్టీ పెట్టలేదని. పవన్ కనుక పదవులు కావాలీ అనుకుంటే అవి ఆయన వద్దకు వస్తాయని. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారని. అది చాలా సులువు అని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో చేరినా మంత్రి పదవి ఇచ్చేవారు అని చెప్పుకొచ్చారు. కానీ తన తమ్ముడుకి ప్రజల సేవ ముఖ్యమని, పదవులతో పని లేదని, అందుకే తన శక్తికి మించి కష్టపడుతూ జనసేన పార్టీని కొనసాగిస్తున్నాడని నాగబాబు అన్నారు.

ఈ రోజుకీ పవన్ కళ్యాణ్ వద్ద డబ్బులు ఉండవని, ఆయన తాను సంపాదించిన డబ్బు అంతా తెచ్చి మరీ జనసేన కోసం వెచ్చిస్తున్నారు అని నాగబాబు చెప్పారు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టాప్ నంబర్ వన్ హీరో పవన్ అని అయితే ఆయన దగ్గర బ్యాంక్ బ్యాలన్స్ ఉండదని, అదే పవన్ తరువాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల వద్ద మాత్రం వందల కోట్లు ఉన్నాయని నాగబాబు గుర్తు చేసి అదీ పవన్ వ్యక్తిత్వం అన్నారు.

పవన్ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరని, ఆయన విలువలకే కట్టుబడి ఉంటారని, రేపు అన్న దాన్ని చూసి భయపడి దాచుకోవడం తెలియని వ్యక్తి తన తమ్ముడు అని అన్నారు. పవన్ ఎవరైనా కోరుకుంటే తన సర్వస్వం త్యజించి రోడ్డు మీదకు ఈ క్షణాన వచ్చేస్తాడు అని అంత మంచి మనసు ఆయనది అంటూ చాలా చెప్పారు.

ఈ విషయాలు అన్నీ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కి బీజేపీలో కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఉందన్న సంగతి మాత్రం ఇంతవరకూ ఎవరికీ తెలియదు. పైగా బీజేపీ పవన్ విషయంలో 2014 తరువాత ఎడం పాటిస్తూనే ఉంది. ఇక 2019లో బీజేపీని నిందిస్తూ పవన్ వామపఖాలతో కలసి వెళ్లారు. 2020లో మళ్ళీ బీజేపీలో చేరినా పవన్ రెండు సీట్లలో ఓడిపోవడంతో ఆయనకు బేరమాడే శక్తి బీజేపీ వద్ద లేదని విశ్లేషణలు వచ్చాయి.

మరి పవన్ని ఎపుడు బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసింది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. బహుశా నాగబాబు వద్దనే ఆ వివరాలు ఉండవచ్చు. ఇక 2014 తరువాత నుంచి 2019 మధ్యలో బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తమ పార్టీలో విలీనం చేయమని కోరిందని వార్తలు వచ్చాయి. బహుశా అలా కనుక పవన్ చేసి ఉంటే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసేవారేమో. ఏది ఏమైనా పవన్ కి కేంద్ర మంత్రి పదవి అన్నది మాత్రం ఏపీ రాజకీయాల్లో చూస్తే కొత్త విషయమే.

మొత్తానికి చూస్తే నాగబాబు ఒక విషయం లో తమ్ముడు గొప్పతనాన్ని చెబుతూ మరో విషయంలో మాత్రం జనసైనికుల భావనలను ఇబ్బంది కలిగించారా అన్న చర్చ కూడా వస్తోంది. అదెలా అంటే పవన్ కి పదవుల మీద వ్యామోహం లేదు అని నాగబాబు అన్నారు. ఆ విధంగా ఆయన పదవులు వదులుకున్నారు అని చెప్పారు. మరి పవన్ని సీఎం కావాలని జనసైనికులు కోరుకుంటున్నారు. మరి ఆ పదవి కనుక పవన్ కి దక్కితే చూడాలని వారి ఆశ. తనకు పదవులు వద్దు అని రేపటి రోజున తెలుగుదేశం పొత్తులో పవన్ తగ్గిపోతారా అన్న చర్చకు నాగబాబు తాజా కామెంట్స్ దారితీసేలా ఉన్నాయని అంటున్నారు.