Begin typing your search above and press return to search.

నరసాపురంలో నాగబాబు పరిస్థితి ఏంటి.?

By:  Tupaki Desk   |   21 March 2019 4:42 AM GMT
నరసాపురంలో నాగబాబు పరిస్థితి ఏంటి.?
X
మెగా బ్రదర్‌ నాగబాబు నరసాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి అందరికి షాక్‌ ఇచ్చారు పపన్‌ కల్యాణ్‌. అసలు పవన్‌ కల్యాణ్ ప్రకటించేవరకు నాగబాబుకి ఎంపీగా సీటు ఇవ్వబోతున్నారనే విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. చాలా సైలెంట్‌ గా పనికానిచ్చేశారు పవన్‌. అయితే నాగబాబు కచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతోనే నరసాపురం లోక్‌ సభ స్థానం ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాగబాబు సొంత ఊరు మొగల్తూరు నరసాపురం ఎంపీ లోక్‌ సభ స్థానం కిందకే వస్తుంది. చిరంజీవి తన సొంతూరు పెద్దగా వెళ్లరు కానీ.. నాగబాబు ఇప్పటికే ఆ ఊరి ప్రజలతో టచ్‌ లో ఉంటారు. ఎందుకంటే.. చిరంజీవి చేపట్టే ఏ కార్యక్రమాన్ని అయినా దగ్గరుండి చూసేది నాగబాబే. దీంతో.. మొగల్తూరు - ఆ చుట్టు పక్కన ఉన్న ఓట్లు మొత్తం నాగబాబుకే గంపగుత్తగా పడతాయని ఒక అంచనా.

ఇక అటు పవన్‌ కల్యాణ్‌ - ఇటు నాగబాబు ఇద్దరూ పశ్చిమ గోదావరి జిల్లానే ఎంపిక చేసుకోవడానికి రెండు రీజన్స్‌ ఉన్నాయి. ఒకటి కాపు కమ్యూనిటీ - రెండు అభిమానులు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండడం తమకు బాగా లాభిస్తుందని అంచనా. కాపు ఓటర్ల తర్వాత బీసీ - క్షత్రియ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువ. భీమవరంలో కాపు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అక్కడ 2004 నుంచి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. భీమవరంలో పవన్ కల్యాణ్‌ కు కొండంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కాపులు - అభిమానులు మెగా బ్రదర్స్‌ ను గట్టెక్కిస్తారో - లేదా మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన ఫలితాన్ని ఇస్తారో వెయిట్‌ అండ్ సీ.