Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ నిశ్శ‌బ్దాన్ని మౌనం అనుకోవ‌ద్దు:నాగ‌బాబు

By:  Tupaki Desk   |   18 April 2018 9:25 AM GMT
ప‌వ‌న్ నిశ్శ‌బ్దాన్ని మౌనం అనుకోవ‌ద్దు:నాగ‌బాబు
X
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీ‌రెడ్డి చేస్తోన్న ఆరోప‌ణ‌లు పెను దుమారం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌లపై తొలిసారిగా నటి జీవిత నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్పందించారు. త‌న‌పై, త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ పై లైవ్ డిబేట్ల‌లో నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన వారిపై కేసు న‌మోదు చేశారు. ఇండ‌స్ట్రీపై ఇన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డంపై ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇండ‌స్ట్రీ త‌ర‌ఫునుంచి రియాక్ట్ కావాల‌ని కొంద‌రిని కోరారు. ఈ నేప‌థ్యంలో తాజాగా - మెగా బ్ర‌ద‌ర్ - న‌టుడు నాగ‌బాబు....ఇండ‌స్ట్రీపై వ‌స్తోన్న‌ ఆరోప‌ణ‌ల‌పై - ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తో పాటు మ‌రి కొన్ని స‌మ‌స్య‌లున్నాయ‌ని - వాటిని ప‌రిష్క‌రించడానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని `మా` ఆల్రెడీ ప్ర‌క‌టించింద‌ని నాగ‌బాబు అన్నారు. ఇండ‌స్ట్రీలో 10 శాతం మంది త‌ప్పు చేస్తే....మొత్తం ఇండ‌స్ట్రీని ఒకే గాట‌న క‌ట్టేయ‌డం స‌రికాద‌ని - ఇండ‌స్ట్రీలో అంద‌రూ చెడ్డ‌వారే అని అంటే ఊరుకోబోన‌ని నాగ‌బాబు ఘాటుగా స్పందించారు. త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వ్య‌క్తిగతంగా విమ‌ర్శించ‌డంపై నాగ‌బాబు నిప్పులు చెరిగారు. ప‌వ‌న్ ఏం త‌ప్పు మాట్లాడాడ‌ని ఆయ‌న‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించార‌ని మండిప‌డ్డారు. ప‌వ‌న్ ను రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు ఈ త‌ర‌హా నీచ‌మైన విమ‌ర్శ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమేన‌ని, ఇప్పుడు కొత్తగా రాలేద‌ని నాగ‌బాబు అన్నారు. అయితే, ఇండ‌స్ట్రీలో కొంతమంది వెధవలున్నార‌ని, అంద‌రినీ ఒకే గాట‌న క‌ట్ట‌డం స‌రికాద‌ని నాగ‌బాబు చెప్పారు. ఆర్టిస్టుల‌ను ఎవ‌రన్నా వేధిస్తే చెప్పుతో కొట్టాల‌ని, మొత్తం ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దని అన్నారు. లేడీ ఆర్టిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీసుల‌కు ఫిర్యాదు చేయవచ్చని, మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు చ‌ట్టాలు క‌ఠినంగా ఉన్నాయని చెప్పారు. ఆర్టిస్టుల‌పై వేధింపుల‌ను ప‌రిష్క‌రించేందుకు క్యాష్ క‌మిటీ కూడా ఏర్పాటు చేశామ‌ని, కో ఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ రూపుమాపేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు.ఇవే కాకుండా ఇండ‌స్ట్రీలో చాలా స‌మ‌స్య‌లున్నాయ‌ని, అన్నిటినీ ప‌రిష్క‌రించేందుకు `మా` కృషి చేస్తోంద‌ని చెప్పారు. ఇండ‌స్ట్రీలో అంద‌రూ హీరోయిన్లు...క్యాస్టింగ్ కౌచ్ బారిన ప‌డ‌లేద‌ని, గౌర‌వంగా వ‌చ్చి గౌర‌వంగా న‌టించిన వారు కూడా ఉన్నార‌ని అన్నారు. తన కూతురుని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చానని చెప్పారు. తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పలేద‌ని, నిర్మాత ఇష్టప్ర‌కారం న‌టీన‌టుల‌ను ఎంచుకుంటార‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ సినీ ఇండ‌స్ట్రీ సాఫ్ట్ టార్గెట్ అయింద‌ని, భ‌విష్య‌త్తులో ఎవ‌రూ ఇండ‌స్ట్రీని చుల‌క‌న చేసి మాట్లాడొద్ద‌ని మీడియా సాక్షిగా విజ్ఞ‌ప్తి చేశారు.

త‌న సోద‌రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై శ్రీ‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై నాగ‌బాబు స్పందించారు. ఆమె పేరు ఎత్త‌కుండానే ఘాటుగా విమ‌ర్శించారు. ప‌వ‌న్ పై పని గట్టుకుని కుట్ర‌పూరితంగా వ్య‌క్తిగ‌త ఆరోపణలు చేస్తున్నారని, అత‌డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవ‌రికీ లేద‌ని నాగ‌బాబు మండిప‌డ్డారు. తాను తప్పు చేస్తే...ప్రజల ముందు బహిరంగంగా ఒప్పుకోగ‌ల దమ్మున్న మగాడు తన త‌మ్ముడ‌ని నాగ‌బాబు ఉద్వేగపూరితంగా ప్ర‌సంగించారు. త‌న త‌మ్ముడికి ఆ ద‌మ్ముంద‌ని, ప‌న‌వ్ ను విమ‌ర్శించే వారికి ఆ దమ్ముందా? అని నాగ‌బాబు ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ త‌న‌తో మాట్లాడి కనీసం ఆరు నెలలైంద‌ని, తాను డిస్టర్బ్ చేయడం లేద‌ని, ప్ర‌జ‌ల కోసం సినిమాల‌ను కూడా వ‌దిలి వెళ్లాడని చెప్పారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న స్టార్ హీరోవి...అని చెప్పినా విన‌కుండా ప్ర‌జాసేవ‌కోసం వెళ్లాడ‌ని, వాడు నంబర్ వన్ స్టార్ అని నాగ‌బాబు అన్నారు. అటువంటి వాడిని వ్య‌క్తిగ‌తంగా తిడతారా? వాడిని విమర్శిస్తారా? అంటూ నాగ‌బాబు మండిప‌డ్డారు. ప‌వ‌న్ ను పొలిటిక‌ల్ గా విమర్శించ వ‌చ్చ‌ని....అత‌డి రాజ‌కీయ విధానాల‌పై ప్ర‌శ్నించ‌వ‌చ్చ‌ని....కానీ, వ్యక్తిగతంగా విమర్శించ‌డం ఏమిట‌ని నాగ‌బాబు నిప్పులు చెరిగారు. ఈ ప్ర‌పంచంలో త‌ప్పు చేయ‌ని మనిషి ఎవరూ లేర‌ని, వ్యక్తిగతంగా ప్ర‌తి ఒక్క‌రూ ఏదో త‌ప్పు చేసి ఉంటార‌ని అన్నారు. పవన్ , మెగా ఫ్యామిలీ నిశ్శబ్దాన్ని చేతగానితనంగా అనుకోవద్దని అన్నారు. తాము బ‌ల‌వంతులం కాబ‌ట్టే భ‌రిద్దాం....అన్న‌ ప‌వ‌న్ మాట‌ల‌ను గుర్తుచేసుకున్నారు. ప‌వ‌న్ ను విమర్శిస్తున్న‌ వారి వెనక ఎవరున్నారో తమకు తెలుస‌ని, త‌గిన స‌మ‌యం వ‌చ్చిన‌పుడు స‌మాధానం చెబుతామ‌ని అన్నారు.