Begin typing your search above and press return to search.

నేనేంటో చూపిస్తా..జనసేనలోకి చేరాక నాగబాబు సంచలనం

By:  Tupaki Desk   |   20 March 2019 10:59 AM GMT
నేనేంటో చూపిస్తా..జనసేనలోకి చేరాక నాగబాబు సంచలనం
X
వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోదరుడు నాగబాబును పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించుతున్నట్టు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసిన అనంతరమే నాగబాబు ఉద్వేగంగా స్పందించారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ తమ్ముడి గొప్పతనంపై స్పందించారు. చిన్ననాటి సంగతులపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నా తమ్ముడు తనకంటే వయసులో చాలా చిన్న వాడు.. మా మధ్య వయసు తేడా బాగా ఉందని నాగబాబు చెప్పుకొచ్చాడు. చిన్నగా ఉన్నప్పుడు పవన్ ముద్దుగా ఉండేవాడని.. పవన్ ను చిన్నప్పుడు ఎప్పుడూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడినని తెలిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మేమంతా ఆశ్చర్యపోయే ఒక గ్రేట్ లీడర్ అవుతాడని తాము ఊహించలేదని నాగబాబు తెలిపారు.

ఒకనొక సమయంలో తన తమ్ముడు నాతో ఫోన్ లో కూడా మాట్లాడేవాడు కాదని.. నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఫోన్ ఎత్తితే తాను ఏం మాట్లాడాల్సి వస్తుందోనని భయపడేవాడని నాగబాబు పాత విషయాలు నెమరువేసుకున్నాడు.

జనసేన స్థాపించాక తన పార్టీలోకి కుటుంబ సభ్యులను ఎవరినీ తీసుకోనని పవన్ మొదట భావించాడని నాగబాబు తెలిపారు. కానీ మాకైతే పవన్ కు సాయంగా రాజకీయాల్లో చరుకుగా పాల్గొనాలని ఉండేదన్నారు. ప్రజారాజ్యం సమయంలో తాను రాజకీయాల్లోకి రాలేకపోయానని తెలిపారు. కానీ తమ్ముడు పవన్ పెట్టిన పార్టీలో చేరాలని మొదట మనసులో అనిపించినా తమ్ముడిని తమ్ముడిగానే చూశానని.. నాయకుడిగా పవన్ ను ఉండనిద్దమని ఒత్తిడి చేయలేదని తెలిపారు.

తన తమ్ముడు అని కాదు కానీ.. పవన్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చాలా మంది కన్నా నాకే ఈ విషయం చెప్పడానికి ఎక్కువ హక్కుందని నాగబాబు తెలిపారు. ఎందుకంటే తమ్ముడిని తాను చిన్నప్పటి నుంచి చూశానని నాగబాబు తెలిపారు. చిన్నతనంలో పులిలా పవన్ ఉండేవాడని.. ఎవరి జోలికి వెళ్లేవాడు కాదన్నారు. తన పని తాను చేసుకునే వాడని.. ఒంటరిగా కూర్చుంటూ ఏం మాట్లాడేవాడు కాదని వివరించాడు. తన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు అని అన్నారు.

పవన్ నన్ను పార్టీలోకి రమ్మని పిలిచిన వెంటనే తాను నమ్మలేకపోయానని నాగబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను పిలుపు రాగానే టెన్షన్ పడ్డానని.. నాకంటే చిన్న వాడు కాబట్టే పేరుకే తమ్ముడు.. కానీ నాకు కూడా ఇప్పుడు నాయకుడు పవన్ అంటూ ప్రశంసించాడు. పార్టీలో చేరకముందే జనసేన తరుఫున తన వాణి వినిపించానని.. పవన్ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆఫీస్ లో క్లీన్ చేయడానికి.. సమాజాన్ని క్లీన్ చేయడానికి సిద్దమన్నారు. తమ్ముడి స్ఫూర్తితో ఇంతకాలం మాట్లాడుతూ వచ్చానని.. ఇకపై తానేంటో చూపిస్తానని తెలిపారు.