Begin typing your search above and press return to search.

ఆ పని చేస్తే సగం గుండు కొట్టించుకుంటాడట

By:  Tupaki Desk   |   1 April 2016 4:38 PM GMT
ఆ పని చేస్తే సగం గుండు కొట్టించుకుంటాడట
X
తెలంగాణ జల విధానంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ పై ప్రశంసలు ఓపక్క వ్యక్తమవుతుంటే.. మరోవైపు ఆయన తీరును నిశితంగా విమర్శిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి.. బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్దనరెడ్డి ఒక సవాలు విసిరారు.

మిగిలిన ప్రాజెక్టుల విషయాన్ని వదిలేస్తే.. కేసీఆర్ చెప్పినట్లుగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను రానున్న 30 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ పూర్తి చేస్తే.. తాను సగం గుండు కొట్టించుకుంటానని సవాలు విసిరారు.

ప్రజంటేషన్ సందర్భంగా కేసీఆర్ చెప్పినట్లుగా మాట నిలబెట్టుకోగలరా? అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న మోసాలు.. అవినీతిపై ప్రజల్లోకి వెళ్లి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లుగా నాగం వెల్లడించారు. స్వార్థం కోసం కేసీఆర్ తప్పులు చేస్తున్నారన్న నాగం.. భవిష్యత్తులో ఆయన జైలుకు వెళతారంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నాగం ఒక కీలక ప్రశ్నను సంధించారు.

పాలమూరు – రంగారెడ్డి అంచనాలు ఆర్నెల్లలో ఎందుకు రెట్టింపు అయ్యాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. ప్రాజెక్టు అంచనాలు.. టెండర్లు వంటి వాటిపై తాము అడిగే ప్రశ్నలకు కానీ కేసీఆర్ సమాధానం చెబితే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. లేకుంటే కేసీఆర్ లెంపలేసుకొని బహిరంగ క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. మరి.. నాగం తాజా సవాలుపై కేసీఆర్ స్పందిస్తారా..?