Begin typing your search above and press return to search.

అసెంబ్లీ జరిగితే నాగంకు లాభమేంటి?

By:  Tupaki Desk   |   11 Sep 2015 3:48 AM GMT
అసెంబ్లీ జరిగితే నాగంకు లాభమేంటి?
X
తెలంగాణ అసెంబ్లీ ఈనెల 23 వ తేదీనుంచి ప్రతి పక్షాలు కోరినన్ని రోజులు నిరవధికంగా జరుగుతందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు. ప్రతిపక్షాలకు ఓపిక ఉంటే గనుక.. సభలో అన్ని రకాల సమస్యలను ప్రస్తావించి తేల్చుకోవాలి. సభ గురించి వారు డిమాండ్‌ చేయాలి. అయితే.. సీఎం ప్రస్తుతం విదేశీ టూర్ లో ఉండగా.. తక్షణం శాసనసభను సమావేశపెట్టాలని తెలంగాణ మిషన్‌ కన్వీనర్‌ నాగం జనార్దనరెడ్డి కోరుతున్నారు.

తమాషా ఏంటంటే.. అసెంబ్లీని సమావేశ పరిస్తే.. నాగం జనార్దనరెడ్డికి ఏం ఒరుగుతుందో అర్థం కావడం లేదు. నాగం అటు ఎమ్మెల్యే గానీ, ఇటు ఎమ్మెల్సీ గానీ కాదు. అసెంబ్లీ వేదికగా ఆయన చేయగలిగేది ఏమీ లేదు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో అసెంబ్లీ తక్షణం జరగాలని మాత్రమే నాగం అంటున్నారు.

నిజానికి నాగం జనార్దనరెడ్డి రైతుల కోసం పోరాడ దలచుకుంటే గనుక.. ఆయనకు ఇంకా అద్భుతమైన అవకాశం ఉంది. అసెంబ్లీ వేదిక మీద ఎటూ ఆయనకు ప్రవేశం లేదు. ప్రజావేదిక మీదినుంచే.. ఆయన ఎన్ని పోరాటాలైనా చేయవచ్చు. ఇన్నాళ్లూ భాజపాలో అంటిపెట్టుకుని ఉన్నందుకు తన ఉనికి తనకే ప్రశ్నార్థం అయ్యే మాదిరిగా నాగం సతమతం అయ్యారు. కానీ ఇప్పుడు ఆయనకంటూ సొంత వేదిక తెలంగాణ మిషన్‌ ఉన్నది. దాని ద్వారా ఆయన రైతుల కోసం పోరాటం చేయవచ్చు. మరి అసెంబ్లీ తక్షణ సమావేశం అవసరం అంటూ ఆచరణ సాధ్యం కాని డిమాండును ఎందుకు వినిపిస్తున్నారన్నది మాత్రం అర్థం కావడం లేదు.