Begin typing your search above and press return to search.

రేవంత్ హవాకు ఆ రెడ్డి కోత పెడతాడా?

By:  Tupaki Desk   |   11 Jan 2018 5:30 PM GMT
రేవంత్ హవాకు ఆ రెడ్డి కోత పెడతాడా?
X
తెలంగాణలో విపక్షపార్టీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. బహుశా ఇన్ని మలుపులు తిరుగుతుండడం అధికార పార్టీకే లాభం కావొచ్చ కూడా. ఇటీవలి కాలంలో .. తెలుగుదేశం లో చక్రంతిప్పుతున్న కీలక పదవిలో ఉన్నప్పటికీ కూడా.. ఆ పార్టీ ద్వారా భవిష్యత్తు శూన్యం అనుకుని.. పెద్ద పెద్ద హామీలను ఆశించి కాంగ్రెసులోకి అడుగుపెట్టిన రేవంత్ రెడ్డికి రాను రాను అక్కడి వాతావరణం అంత పాజిటివ్ గా ఏమీ లేదనే సంకేతాలు వస్తున్నాయి. ఆయన ఆశించినట్లుగా ఆయనకు పార్టీలో ఎలాంటి కీలక పదవులు ఇవ్వలేదు. రాహుల్ జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఇక్కడేమీ మార్పులు చోటు చేసుకోలేదు. పాత పీసీసీ కమిటీలే ప్రస్తుతానికి కొనసాగుతాయని కూడా తేల్చిచెప్పేశారు. ఇది రేవంత్ కు చిన్నపాటి నిరాశ కలిగించే విషయం కావొచ్చు. పరిస్థితులు ఇలా ఉండగా.. ప్రస్తుతం పుకార్ల రూపంలో ఉన్న మరో చేరిక.. రేవంత్ హవాకు మరింత కోత పెడుతుందా అనే ప్రచారం కూడా మొదలైంది.

ప్రస్తుతం భాజపాలో ఉన్న నాగం జనార్దనరెడ్డి త్వరలోనే కాంగ్రెసులో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. భాజపాలో ఆయన చాలా కాలంగా ఏమీ పనిలేకుండా ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగానే ఉన్నారు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధిష్టానంపై అసంతృప్తితో కూడా ఉన్నారనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న ప్రచారం. నాగం జనార్దనరెడ్డి విషయానికి వస్తే.. కాంగ్రెసులో ప్రస్తుతం ఉన్న నాయకులతో పోలిస్తే చాలా సీనియర్ అనిపించుకుంటారు. రేవంత్ కంటె చాలా సీనియర్ కింద లెక్క. పైగా ఇద్దరూ ఒకే జిల్లా (పాత మహబూబ్ నగర్ జిల్లా) కు చెందిన వారు. కేసీఆర్ సర్కారు మీద విమర్శలు గుప్పించే విషయంలో రేవంత్ కు ఎంత దూకుడు ఉందో.. నాగం కు కూడా అంతకంటె ఎక్కువ దూకుడే ఉంది. పైగా అన్నిటినీ మించి... నాగంపై ఆరోపణలు కేసులు లేవు.

ఇలాంటి నేపథ్యంలో నాగం జనార్దనరెడ్డి కూడా కాంగ్రెసులో చేరితే - రేవంత్ రెడ్డి కలగన్నంత వైభవస్థితి ఆయనకు అక్కడ సాధ్యం కాకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు. రేవంత్ - రాహుల్ ద్వారా పొందిన హామీలుగా ప్రచారంలో ఉన్న అనేక విషయాలు ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. కనీసం రేవంత్ చేరిన తర్వాత.. తెలంగాణలో ఆయన బలం చాటుకోవడానికి ఓ బహిరంగ సభకు తాను వస్తానని రాహుల్ మాట ఇచ్చినా ఇప్పటిదాకా ఆ ఊసు కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ హవాకు కొత్తగా కోతపెట్టడానికి నాగం కూడా వస్తే సమీకరణాలు ఎలా మారుతాయో నని పలువురు భావిస్తున్నారు.