Begin typing your search above and press return to search.

ఆ సీఎం అంటే విప‌క్షాలకూ భ‌య‌మా?

By:  Tupaki Desk   |   19 Aug 2015 12:17 PM GMT
ఆ సీఎం అంటే విప‌క్షాలకూ భ‌య‌మా?
X
త‌న మాట‌ల‌తో ఒక రేంజ్‌లో విరుచుకుప‌డే తెలంగాణ నేత నాగం జ‌నార్ద‌న‌రెడ్డి. ఫైర్ బ్రాండ్ గా ఉండే ఆయ‌న‌.. ఈ మ‌ధ్య మ‌హా కూల్‌ గా ఉంటున్నారు. బీజేపీ నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. తెలంగాణ అధికార‌ప‌క్షంపై ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన విమ‌ర్శ‌లు త‌క్కువే. ఆ లోటును తీర్చాల‌ని భావించారో.. లేక బీజేపీ బంధ‌నాల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నుకుంటున్నారో కానీ.. తాజాగా తెలంగాణ బ‌చావో అనే ఉద్య‌మ సంస్థ‌ను ఏర్పాటు చేయ‌టం తెలిసిందే.

బీజేపీ నుంచి బ‌య‌ట‌కు రాని ఆయ‌న‌.. తెలంగాణ బ‌చావో మిష‌న్ అంటూ ఒక కార్యాల‌యాన్ని బషీర్ బాగ్‌ లో ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం చేసినా.. దాన్ని తీవ్రంగా విమ‌ర్శించేందుకు విప‌క్షాలు వెనుకాడుతున్నాయ‌ని.. మీడియా సంస్థ‌లు జంకుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

అనాలోచిత నిర్ణ‌యాలు తీసుకుంటూ.. బాధ్య‌తారాహిత్యంతో సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆయ‌న‌.. విప‌క్షాలు విఫ‌లం కావ‌టంతో.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచేందుకు తానీ సంస్థ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. స‌చివాల‌యం.. ఛాతీ.. ఉస్మానియా ఆసుప‌త్రుల్ని కూల్చేస్తామ‌ని చెబుతూ విధ్వంస‌క‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని కేసీఆర్‌ పై మండిప‌డ్డారు. హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న‌.. ఆకాశ హ‌ర్మ్యాలు అంటూ క‌ల్ల‌బుల్లి మాట‌లు చెప్పారే త‌ప్ప చేత‌ల్లో చేసి చూపించ‌లేద‌న్నారు.

ప‌వ‌ర్ అంతా ఆయ‌న ఫ్యామిలీకే ప‌రిమిత‌మైంద‌న్న నాగం.. తాను ప్రారంభించిన బ‌చావో తెలంగాణ మిష‌న్ కు సంబంధించి గ్రామ స్థాయిలో క‌మిటీలు ఏర్పాటు చేస్తామ‌ని.. తెలంగాణ ప్ర‌జానీకానికి అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు.. నాగం త‌మ పార్టీ నేత అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న తాజాగా ప్రారంభించిన తెలంగాణ బ‌చావో మిష‌న్‌కు పార్టీ అధినాయ‌క‌త్వం అనుమ‌తి లేద‌ని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.